కరోనా టీకాకు సంబంధించి ఓ విషయంపై అమెరికాలో జోరుగా ప్రచారం జరిగింది. కొవిడ్-19 వ్యాక్సిన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తాయి. ఫైజర్ టీకా తీసుకున్న వారిని తాకినా, వారి శరీరం వెదజల్లే పరిమళాన్ని పీల్చినా వ్యాక్సిన్ మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అనేక పోస్టులు షేర్ అయ్యాయి. దీనివల్ల కొందరిపై దుష్ప్రభావం పడుతోందని, ముఖ్యంగా గర్భిణీలపై అధిక ప్రభావం ఉంటోందని వార్తలు వచ్చాయి. టీకా తయారు చేసిన ఫైజర్ సంస్థ కూడా దీన్ని ధ్రువీకరించిందని ప్రచారం సాగడం గమనార్హం.
అయితే ఈ వార్తల్లో నిజానిజాలేంటో తేల్చేందుకు అమెరికా వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ 'ఫ్యాక్ట్ చెక్' చేసింది. ఫైజర్ టీకా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందదని తేటతెల్లం చేసింది. ఆ సంస్థ కూడా ఈ విషయాన్ని ఎక్కడా ధ్రువీకరించలేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి ఫైజర్ విడుదల చేసిన 'ప్రోటోకాల్ డాక్యుమెంట్'లోని ప్రామాణిక భాషను కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ అసత్య వార్తలు వ్యాప్తి చెందాయని పేర్కొంది.
సాధ్యం కాదు..
"ఫైజర్-బయోఎన్‌టెక్ కొవిడ్-19 టీకా సింథటిక్ ఎంఆర్ఎన్ఏ(mRNA) వ్యాక్సిన్. దీనిలో ఎలాంటి వైరస్ కణాలు ఉండవు. శరీరంలో సజీవ వైరస్ ఉత్పత్తి కూడా కాదు. అందువల్ల శరీరం నుంచి వ్యాక్సిన్ వెలువడదు." అని ఫైజర్ అధికార ప్రతినిధి జెరికా పిట్స్.. అసోసియేటెడ్ ప్రెస్‌కు ఈ-మెయిల్లో వివరణ ఇచ్చారు. టీకాను శరీరం నుంచి వెలువడే పరిమళం రూపంలో పీల్చడం సాధ్యం కాదని, డోసుగా తీసుకోవడం వల్ల మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తుందని స్పష్టం చేశారు.
ఫైజర్ టీకాకు అమెరికా ఆహార, ఔషధ నియంత్ర సంస్థ(ఎఫ్‌డీఏ) గతేడాది డిసెంబర్లో ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు గర్భిణీలు, పాలిచ్చే తల్లులను దూరంగా ఉంచారు. ట్రయల్స్‌లో పాల్గొన్న మహిళలు గర్భం దాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కొంతభాగం తీసుకొని..
అయితే ఫైజర్ టీకా ట్రయల్స్‌కు సంబంధించి నవంబర్‌లో ప్రోటోకాల్ డాక్యుమెంట్ విడుదలైంది. దీనిలోని గర్భిణీలకు సంబంధించిన కొంత భాగాన్ని తీసుకొని కొందరు తప్పుడు పోస్టులు పెట్టారు. వ్యాక్సిన్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని, దుష్ప్రభావాలు కూడా ఉంటున్నాయని ప్రచారం చేశారు.