Countires reaction on cds death: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అమెరికా, రష్యా, చైనా, పాకిస్థాన్ సహా వివిధ దేశాలు విచారం వ్యక్తం చేశాయి. భారత రక్షణ రంగంలో రావత్ చేసిన సేవలను స్మరించుకున్నాయి. ఆయన కుటుంబాలను, ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇతర అధికారుల కుటుంబాలకు సంతాపం తెలిపాయి. రావత్ మృతి పట్ల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"భారత్ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, ఇతర అధికారుల మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. భారత్-అమెరికా రక్షణ సంబంధాలను మెరుగుపరచడంలో అసాధారణమైన నేతగా మేం జనరల్ రావత్‌ను గుర్తించుకుంటాం.
-ఆంటోని బ్లింకెన్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి.
"అమెరికా, భారత్ రక్షణ భాగస్వామ్యంలో జనరల్ బిపిన్ రావత్ చెరగని ముద్ర వేశారు. భారత సాయుధ దళాలను మరింత యుద్ధ సన్నద్ధులుగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. నా తరఫున, అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ తరపున రావత్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను."
-లాయిడ్ ఆస్టిన్, అమెరికా రక్షణ మంత్రి.
జనరల్ రావత్ తమకు అత్యంత విలువైన భాగస్వామి అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. భారత్- అమెరికా రక్షణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన ఎంతో సాయం చేశారని చెప్పారు.
Un secretary general on cds Bipin Rawat death
భారత సీడీఎస్ జనరల్ రావత్ సహా హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జనరల్ బిపిన్ రావత్ ఆయన సతీమణి సహా ఇతర అధికారుల కుటుంబాలకు, ప్రజలకు, భారత ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ వెల్లడించారు. కాంగోలో యూఎన్ పీస్ కీపింగ్ మిషన్ 2008, 2009లో రావత్ సేవలను గుటెరస్ స్మరించుకున్నారని వెల్లడించారు.
విదేశీ రాయబారుల సంతాపం..
రావత్ కుటుంబ సభ్యులు సహా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇతర అధికారుల కుటుంబ సభ్యులకు దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. అమెరికాకు బలమైన స్నేహితుడు, భాగస్వామి రావత్ అని పేర్కొంది. అమెరికా సైన్యంతో భారత రక్షణ సహకారాలను విస్తృతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడింది.