అమెరికా ఉత్పత్తులపై విధించిన అదనపు సుంకాలను చైనా నిలిపివేసింది. ఇరుదేశాల మధ్య మొదటి దశ వాణిజ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో డ్రాగన్ ఈ చర్య తీసుకుంది.
"వాణిజ్య యుద్ధం సమయంలో అమెరికాకు చెందిన వాహన, వాహన విడిభాగాలపై ... చైనా 10 శాతం, 5 శాతం చొప్పున అదనపు సుంకాలను విధించింది. అయితే ఇప్పుడు ఈ అదనపు సుంకాలను నిలిపివేస్తున్నాం."
- చైనా ఆర్థికమంత్రిత్వ శాఖ
ట్రంప్ మార్గంలో..
మొదటి దశ వాణిజ్య ఒప్పందం కుదిరిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా ఉత్పత్తులపై అదనపు సుంకాలను రద్దు చేశారు. ఇప్పుడు చైనా కూడా ఇదే మార్గాన్ని అనుసరించింది.
ఇంకా సంతకాలు కాలేదు...!
అమెరికా చైనా మధ్య శుక్రవారం మొదటి దశ వాణిజ్య ఒప్పందం జరిగింది. ఇందులో పరస్పరం విధించుకున్న అదనపు సుంకాలు రద్దు చేయాలని, మేధోహక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. దీనితో ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థికవ్యవస్థల మధ్య 21 నెలల ప్రతిష్టంభన సడలి కొంత పురోగతి సాధించినట్లయింది. అయితే ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు ఇంకా సంతకం చేయకపోవడం గమనార్హం.
యూఎస్-చైనా ఢీఢీ...
వాణిజ్య యుద్ధం సమయంలో చైనాకు చెందిన 160 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై 15 శాతం అధిక సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వాహనాలపై 25 శాతం, వాహన విడిభాగాలపై 5 శాతం అదనపు సుంకం విధిస్తామని హెచ్చరించింది. తాజా ఒప్పందంతో ఈ సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.
ఇదీ చూడండి: 'సర్దార్ పటేల్' 69వ వర్ధంతి.. ప్రధాని మోదీ నివాళి