జనవరి 20న అగ్రరాజ్య తదుపరి అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు డెమొక్రాటిక్ నేత జో బైడెన్. ఇప్పటికే.. కరోనా మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమంలో భారీ మార్పులు చేశారు. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం సందర్భంగా.. క్యాపిటల్ భవనాన్ని ముట్టడించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన ప్రయత్నంతో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమ భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
ట్రంప్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగి.. క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకొచ్చిన ప్రదేశానికి దగ్గరగా ఉన్న వెస్ట్ ఫ్రంట్ కార్యాలయంలోనే బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ దాడి జరిగినప్పటికీ.. ఏర్పాట్లు ముందుకు సాగుతాయని తెలిపారు నిర్వహణ బాధ్యత కలిగిన కాంగ్రెస్ నాయకులు.
" నిన్నటి రోజు దేశానికి బాధాకరమైన, చీకటి రోజు. క్యాపిటల్‌పై దారుణమైన దాడి మమ్మల్ని ఆపదు. ప్రమాణ స్వీకార దేశ సంప్రదాయం.. శాంతి, గందరగోళం, ప్రతికూల సమయాల్లో జరుగుతోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ ప్రమాణ స్వీకారం విజయవంతంగా పూర్తి చేస్తాం. బుధవారం జరిగిన ఘటనలతో భద్రతా బలగాలు అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. "