ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం కోసం చైనా వేస్తున్న అడుగులకు దీటుగా భారీ ఎత్తున మౌలిక సదుపాయాల విస్తరణ ప్రణాళికను వర్ధమాన ప్రపంచం కోసం సిద్ధం చేయాలని జి-7 దేశాధినేతలు శనివారం నిర్ణయించారు. అయితే.. మానవ హక్కుల్ని కాలరాస్తున్న విషయంలో చైనాకు కళ్లెం వేయాలన్న విషయంలో మాత్రం వెంటనే ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ సదస్సు సందర్భంగా.. వివిధ దేశాధినేతలతో బలవంతపు కార్మిక విధానాలను చైనా అనసరిస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. చైనాతో ఆర్థికంగా పోటీ పడటానికి మరింత బలమైన ఏకీకృత కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
చైనాకు అడ్డుకట్ట విషయంలో అమెరికాకు మద్దతుగా కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ నిలిచాయి. జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్ మాత్రం సందేహాన్ని వ్యక్తం చేశాయని బైడెన్ యంత్రాంగానికి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు తెలిపారు. చైనా కార్మిక విధానాలు, వుయ్గర్లు సహా ఇతర మైనార్టీల అణచివేతకు వ్యతిరేకంగా జి-7 దేశాలైన అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇటలీలు తమ గళాన్ని వినిపించాలని బైడెన్ కోరినట్లు శ్వేతసౌధ అధికారులు తెలిపారు. ఈ శిఖరాగ్ర సమావేశం ముగిసేసరికి దీనిపై ఉమ్మడి ప్రకటన వెలువడుతుందని బైడెన్ ఆశిస్తున్నారని చెప్పారు. కానీ, చైనాకు మిత్రదేశాలైన కొన్ని యూరోపియన్ దేశాలు ఇందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదని తెలుస్తోంది.