అమెరికా వాణిజ్య విభాగ రాయబారిగా చైనా అమెరికన్ క్యాథరీన్ తాయ్‌ను ఎంపిక చేయాలని ఆ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ట్రేడ్ కౌన్సిల్ ముఖ్య అధికారిగా ఉన్న తాయ్‌ను.. క్యాబినెట్ స్థానానికి సమానమైన ఈ పదవికి ఎంపిక చేసే అంశాన్ని సెనెట్‌లో ఓట్ల ద్వారా నిర్ణయిస్తారు.
చైనా అధికారిక భాష మాండరీన్ స్పష్టంగా తెలిసిన క్యాథరీన్ తొలుత యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఆఫీస్‌లోని చైనా ట్రేడ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను పర్యవేక్షించారు. చైనాతో వాణిజ్య యుద్ధ సమయంలో అమెరికా వ్యూహాన్ని రచించారు.
అమెరికా-చైనా మధ్య జనవరిలో జరిగిన వాణిజ్య చర్చలు ఏ నిర్ణయమూ తీసుకోకుండానే ముగిశాయి. చైనా దిగుమతులపై 360 బిలియన్ డాలర్ల సుంకాల విషయం కూడా ఇంకా ఎటూ తేలలేదు. బైడెన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ అంశాలన్నీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో క్యాథరీన్ తాయ్‌ను వాణిజ్య రాయబారిగా నియమించే అంశంపై ఆసక్తి నెలకొంది.