అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బెడన్.. తన ఉన్నత స్థాయి ఆర్థిక బృందాన్ని ప్రకటించారు. ఈ బృందంతో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తానని పేర్కొన్నారు. తన బృందంలో ఎందరో అనుభవజ్ఞులు ఉన్నారని.. ఫలితంగా సంక్షోభం నుంచి అందరు రికవరీ అయ్యే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
బైడెన్ ఆర్థిక బృందంలో జానెట్ యెల్లెన్(కోశాధికారి), భారతీయ అమెరికన్ నీరా టాండన్(డైరక్టర్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్), వాల్లీ ఆడెయెమొ(ఖజానా శాఖ డిప్యూటీ సెక్రటరీ), సిసిలియ రౌజ్(కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఛైర్మన్), జారెడ్ బెర్న్‌స్టెయిన్-హీథర్ బౌషే(కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సభ్యులు) ఉన్నారు. డెలావేర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీరి పేర్లను ప్రకటించారు బైడెన్.
"ఒక్క విషయం స్పష్టంగా చెబుతున్నా. వీరితో పాటు రానున్న రోజుల్లో మరికొంతమందిని జట్టులోకి చేర్చుకుంటాం. వీరందరితో కలిసి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తాం. ఈ బృందం ఎన్నో పరీక్షలను ఎదుర్కొంది. ఎన్నో ఏళ్ల అనుభవం దీని సొంతం. వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వీరు ఎన్నో సంచలనాలను సృష్టించారు. అమెరికా ప్రజల సామర్థ్యం కన్నా గొప్పది ఏది లేదు. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సంక్షోభం, అసమాన ఆర్థిక పరిస్థితుల నుంచే ఓ కొత్త అమెరికా ఆర్థిక వ్యవస్థను రూపొందించవచ్చు. ఇందుకోసం అందరం కలిసిగట్టుగా పనిచేయాలి."