తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్ ఉత్తర్వులు వెనక్కి- ట్రాన్స్​జెండర్లు సైన్యంలోకి!

ట్రాన్స్​జెండర్లను సైన్యంలోకి అనుమతించే ఉత్తర్వులపై సంతకం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ మేరకు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్​జెండర్ అన్న నెపంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి జాబితాను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

biden-reverses-trump-ban-on-transgender-people-in-military
ట్రంప్ ఉత్తర్వులు వెనక్కి- ట్రాన్స్​జెండర్లు సైన్యంలోకి!

By

Published : Jan 26, 2021, 5:25 AM IST

మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ తన పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిని పక్కకు పెడుతున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మరో కీలక ఉత్తర్వుపై సంతకం చేశారు. ట్రాన్స్‌జెండర్లను సైన్యంలోకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రక్షణ మంత్రి ఆస్టిన్‌ లూయిడ్‌తో జరిగిన సమావేశంలో ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ట్రాన్స్‌జెండర్‌ నెపంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి జాబితాను 60రోజుల్లోగా సమర్పించాలని కోస్ట్‌గార్డ్‌ విభాగాన్ని బైడెన్ ఆదేశించారు. లింగ గుర్తింపు ఆధారంగా ఏ వ్యక్తిని మిలిటరీ నుంచి బలవంతంగా తొలగించడాన్ని నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

"అర్హత కలిగిన అమెరికా పౌరులందరూ దేశానికి యూనిఫాంలో సేవ చేయడానికి వీలు కల్పిసున్నాం. అందరికీ ఈ అవకాశం కల్పించడం వల్ల సైన్యంతో పాటు దేశానికీ ప్రయోజనం కలుగుతుంది. అందరం కలిసికట్టుగా ఉంటే అమెరికా శక్తిమంతంగా కొనసాగుతుంది. దేశ సైన్యం ఇందుకు అతీతం కాకూడదు."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

మరోవైపు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను పునరుద్ధరించే ఉత్తర్వులపై బైడెన్ సంతకం చేయనున్నట్లు శ్వేతసౌధ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి తెలిపారు. బ్రెజిల్, ఐర్లాండ్, యూకే సహా 26 ఐరోపా దేశాలకు ఈ ఆంక్షలు వర్తించనున్నట్లు చెప్పారు. కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికాను సైతం ఈ జాబితాలో చేర్చనున్నట్లు స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసేందుకు ఇది సమయం కాదని అన్నారు. ఈ ఆంక్షలు అమెరికాకు వెళ్లే ఇతర దేశస్థులకు వర్తించనున్నాయి.

కాగా, దేశంలో కరోనా పరిస్థితిపై బుధవారం నుంచి శ్వేతసౌధం ప్రకటనలు జారీ చేయనున్నట్లు తెలిపారు సాకి. కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, టీకా లభ్యతపై సమాచారం అందిస్తామని పేర్కొన్నారు. వారానికి మూడు రోజుల పాటు ఈ వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details