పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత ఇప్పట్లో తగ్గుముఖం పట్టే పరిస్థితులు కనపడటం లేదు. తాజాగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేసిన బైడెన్.. కాల్పుల విరమణకు చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. అయితే ఎవరెన్ని చెప్పినా, లక్ష్యాన్ని సాధించేంతవరకు తమ "ఆపరేషన్" ఆగబోదని నెతన్యాహు తేల్చిచెప్పడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారంపై ఇజ్రాయెల్- అమెరికా బహిరంగంగా విభేదించడం ఇదే తొలిసారి.
బైడెన్ ఫోన్..
నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ బుధవారం ఫోన్ చేశారు. పాలస్తీనాతో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు. ఒక రోజు వ్యవధిలో.. పరిస్థితిని అదుపు చేసే విధంగా చర్యలు చేపడతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇరు దేశాలు కాల్పుల విరమణ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. గత పది రోజులుగా పరస్పర దాడులతో పాలస్తీనా-ఇజ్రాయెల్ దేశాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా గాజా ప్రాంతం విలవిలలాడుతోంది. పాలస్తీనా నిరసనకారులు- ఇజ్రాయెల్ పోలీసుల మధ్య మొదలైన ఘర్షణ.. ఇరు దేశాలను యుద్ధం అంచు వరకు తీసుకెళ్లాయి.
గాజాలో.. దాడులు, ఘర్షణల్లో ఇప్పటివరకు 200మంది మరణించారు. అయితే మిత్ర దేశమైన ఇజ్రాయెల్‌కు ఇంతకాలం మద్దతిస్తూ వచ్చారు బైడెన్. ఇన్నిరోజుల్లో ఎన్నడూ కాల్పుల విరమణ కోసం ప్రత్యక్షంగా ఒత్తిడి పెట్టలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. పరిస్థితిని అదుపుచేయాలని బైడెన్ మీద కూడా ఒత్తిడి పెరుగుతోందని.. అందుకే చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.