ఐక్యరాజ్యసమితి వేదికగా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించాలని, రాబోయే ఎన్నికల్లో ఓడించాలని డిమాండ్లు పెరుగుతున్న సమయంలో ఐరాస సర్వసభ్య సమావేశంలో జాతీయవాదాన్ని, అమెరికా సార్వభౌమాధికారాన్ని ప్రతిబింబించేలా ప్రసంగించారు.
అంతర్జాతీయ సంస్థలు, కూటములకు బదులుగా... సరిహద్దు దేశాల మధ్య బలమైన సంబంధాలను, పరస్పర వాణిజ్య ఒప్పందాలు చేసుకుని తమతమ దేశాలకు ప్రాధాన్యమివ్వాలని ప్రపంచ దేశాల అధినేతలకు సూచించారు.
భవిష్యత్తు ప్రపంచవాదులది కాదని ఉద్ఘాటించారు ట్రంప్. బలమైన స్వతంత్రత కలిగిన దేశాలకు చెందినదిగా అభివర్ణించారు. ఇరాన్ దూకుడు స్వభావం కొనసాగుతున్నంత కాలం ఆంక్షలు తొలగించేదిలేదని స్పష్టం చేశారు. అమెరికా ఏ దేశంతోనూ గొడవలను కోరుకోదని... దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఐరాస వేదికగా ఇరాన్, చైనా లకు ట్రంప్ హెచ్చరిక
"ఆంక్షల నుంచి తప్పించుకునేందుకే ఇరాన్ హింసాత్మక ధోరణిని అవలంబిస్తోంది. ఈ కారణంగానే సౌదీ అరేబియా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడికి సమాధానంగా మేం అత్యధిక స్థాయిలో ఇరాన్‌పై ఆంక్షలను విధించాం. సెంట్రల్ బ్యాంకుపై నిషేధం విధించాం. అన్ని దేశాలు దీనిని పాటించాలి. ఏ దేశమూ ఇరాన్ రక్త పిపాసను ప్రోత్సహించకూడదు.
2001లో ప్రపంచ వాణిజ్య సమాఖ్యలోకి చైనా వచ్చింది. ఈ కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థను సరళీకరణ చేసేందుకు అవకాశం ఏర్పడింది. భద్రతను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్తుల కోసం రూల్ ఆఫ్ లా తెచ్చింది. కానీ రెండు దశాబ్దాల అనంతరం ఈ నిర్ణయం తప్పని తెలుస్తోంది. చైనా వ్యవసాయ సంస్కరణలు అమలు చేసేందుకు సుముఖంగా లేదు. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెప్పుకోవడం సరికాదు. అమెరికా ప్రజలకు చేటు చేసే ఒప్పందాన్ని నేను ఒప్పుకోలేను."
- ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఇదీ చూడండి: ఉగ్రమూకల సంగతి మోదీ చూసుకుంటారు: ట్రంప్