చైనాపై మరోసారి సుంకాల మోత మోగించింది ట్రంప్ సర్కారు. ఆహార పదార్థాలు, క్రీడా సామగ్రి, సంగీత వాయిద్యాలు, గృహోపకరణాలపై కొత్తగా 15 శాతం సుంకాలు విధించింది. అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందం చేసుకునే విధంగా బీజింగ్‌పై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. శ్వేతసౌధం తాజా నిర్ణయంతో దాదాపు 300 అమెరికన్ బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై ప్రభావం పడనుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం అంచనా వేసింది. తాజాగా విధించిన సుంకాలు ఆదివారం ఉదయం నుంచే అమలులోకి వచ్చాయి.
ఈ ఏడాది చివరికల్లా అన్ని చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని అమెరికా గతవారమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. చైనా దిగుమతులపై మరికొద్ది రోజులు సుంకాలు పెంచకూడదని కోరిన అమెరికా సంస్థలపై విరుచుకుపడ్డారు ట్రంప్. వందలాది సంస్థలు తమ అసమర్థ నిర్వహణను గుర్తించేందుకు బదులు తెలివిగా సుంకాలను తప్పుపడుతున్నాయని ట్వీట్ చేశారు. సుంకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసేది లేదన్న అమెరికా అధ్యక్షుడు ఈ నెలలో డ్రాగన్ దేశంతో జరగనున్న చర్చలు సఫలం చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.