వాయు కాలుష్యం మానవాళికి చేస్తున్న చేటు అంతాఇంతా కాదు! నెలలు నిండక ముందే బిడ్డలు పుట్టడానికి ఇది కారణమవుతున్నట్టు కాలిఫోర్నియా వర్సిటీ హెచ్చరించింది. ఈ అంశంపై చేపట్టిన పరిశోధన ఫలితాలను బుధవారం వెల్లడించింది. వాయు కాలుష్యం ఇంటా, బయటా చూపుతున్న ప్రభావాలపై శాస్త్రవేత్తలు అధ్యయనం సాగించారు. ఇందుకు సంబంధించి 204 దేశాల నుంచి డేటాను సేకరించి, విశ్లేషించారు.
2019లో 60 లక్షల శిశువులు ఇలా..
"గాలిలో ఉండే పీఎం 2.5(పార్టిక్యులేట్ మ్యాటర్-2.5) పరిమాణంలోని కాలుష్య కారక రేణువులు, వంట కారణంగా వెలువడే పొగ.. గర్భిణులపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా నెలలు నిండకముందే కాన్సు కావడానికి దారితీస్తున్నాయి. ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది శిశువులు నెలలు నిండక ముందే జన్మించారు. మరో 30 లక్షల మంది తక్కువ బరువుతో పుట్టారు. ఈ పరిస్థితి కారణంగా నవజాత శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఇలా జన్మించినవారు జీవితాంతం తీవ్రస్థాయి రుగ్మతలతో సతమతమయ్యే ప్రమాదముంది" అని పరిశోధనకర్త రాకేశ్ ఘోష్ తెలిపారు.
ప్రపంచంలో 90 శాతానికి పైగా మంది బహిరంగ ప్రదేశాల్లో వాయు కాలుష్యానికిగురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో పేర్కొంది. వంట చేసే నిమిత్తం బొగ్గు, పిడకలు, కలపను కాల్చడం ద్వారా కోట్ల మంది ఇళ్లలో కాలుష్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని ప్రస్తావించిన కాలిఫోర్నియా పరిశోధకులు.కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా ఆగ్నేయ, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో 78శాతం వరకూ ముందస్తు జననాలను నివారించవచ్చని పేర్కొన్నారు.