అమెరికా-తాలిబన్ శాంతి ఒప్పందానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. శాంతి ఒప్పందంలో భాగంగా వేలాది మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేయాల్సి ఉంది. అయితే వచ్చే వారం జరగనున్న ఆఫ్గాన్ అధికార భాగస్వామ్య చర్చల కంటే ముందు వారిని విడిచిపెట్టేది లేదని ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ బహిరంగంగానే తేల్చి చెప్పారు.
చెప్పాల్సింది అమెరికా కాదు
తాలిబన్ ఖైదీల విడుదల అనేది అమెరికా చేయగల వాగ్దానం కాదని, ఇది పూర్తిగా తమ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని ఘనీ స్పష్టం చేశారు. శాంతి చర్చలు ప్రారంభమయ్యే ముందు ఖైదీలను విడుదల చేయడానికి తాను సిద్ధంగా లేనని ఆయన అన్నారు.
ఒప్పందానికి కట్టుబడి ఉంటే చాలు..
అమెరికా మాత్రం రానున్న 14 నెలల్లో ప్రణాళికాబద్ధంగా తమ సైనిక దళాలను అఫ్గానిస్థాన్ నుంచి ఉపసంహరిస్తామని పేర్కొంది. అయితే ఇదంతా ఉగ్రవాద నిరోధక పనితీరుతో ముడిపడి ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి అఫ్గాన్ అంతర్గత చర్చల పురోగతితో సంబంధం లేదని పేర్కొంది.