నేటికి అమెరికా '9/11' ఘటనకు 18ఏళ్లు. న్యూయార్క్‌లో నాటి ప్రపంచ వాణిజ్య సముదాయం జంట భవనాలపై అల్‌ఖైదా ఉగ్రసంస్థ చేసిన మారణహోమం ఇప్పటికీ అమెరికెన్లు వెంటాడుతోంది. ఈ ఘటనలో 3 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6వేల మంది గాయపడ్డారు. తమ వారి కోసం అమెరికన్లు ఇప్పటికీ కన్నీరుమున్నీరు పెట్టుకుంటున్నారు. ఈ భీకర దాడికి 18 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
9/11 మారణహోమానికి 18 ఏళ్లు- వెంటాడుతున్న జ్ఞాపకాలు - అల్‌ఖైదా
9/11.. ఈ తేదీని ప్రపంచ దేశాలు ఎప్పటికీ మర్చిపోలేవు. అమెరికాలో అతిపెద్ద ఉగ్రదాడి జరిగిన రోజది. ఎన్నో వేల మంది ప్రాణాలు తీసిన ఘటన అది. ఈ దాడి.. అమెరికన్ల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. అల్‌ఖైదా అగ్రనేత లాడెన్ సూచనలతో జరిగిన ట్విన్ టవర్ ఆత్మహుతి దాడికి సంబంధించిన కొన్ని కీలకాంశాలు...
9/11 మారణహోమానికి 18 ఏళ్లు- వెంటాడుతున్న జ్ఞాపకాలు
ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్‌ఖైదా ఉగ్రసంస్థ.. ఈ దాడికోసం 5 లక్షల డాలర్లు వెచ్చించింది. సహాయక చర్యల కోసం అమెరికా.. దాడి జరిగిన నాలుగు వారాల్లోనే 123 బిలయన్ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
- ఈ ఉగ్రదాడి ట్విన్ టవర్స్‌పైనే ప్రభావం చూపలేదు. ఎందరో పౌరులకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఈ దాడిలో 3వేలమంది మృతి చెందారు. ఇందులో 90 శాతం మంది సాధారణ పౌరులే. వేల మందికి గాయాలు అయ్యాయి. తల్లులతో పాటు 11మంది గర్భస్థ శిశువులు వారి ఉదరంలోనే ప్రాణాలు కోల్పోయారు.
- 1.8 మిలియన్ టన్నులున్న శిథిలాలను తొలగించడానికి 3.1 మిలియన్ గంటల సమయం పట్టింది. ఇందుకు 750 మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి.
- దాడిలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బంది కంటే... పునారావాస చర్యలు చేపడుతూ అసువులు బాసిన వారే అధికం. శ్వాస తీసుకోవడం కష్టమై అనేక మంది పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, పునారావాస కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు ప్రాణాలు కోల్పోయారు. పునారావాస చర్యల్లో పాల్గొన్న మరికొందరు.. అనంతర కాలంలో క్యాన్సర్, మానసిక రోగాలు, జీర్ణకోశ సమస్యలతో బాధపడ్డారు.
- లాబ్రాడర్ రిట్రీవర్ జాతికి చెందిన సాల్టీ, రోసెల్లే అనే శునకాలు సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషించాయి. భవనం కూలేందుకు కొద్ది సమయం ముందు ఉత్తర భవంతిలో 30 మంది చిక్కుకుపోయిన స్థలాన్ని యజమానులకు చూపి వారి ప్రాణాలను రక్షించాయి. ఈ రెండు శునకాలకు 'పీపుల్స్ డిస్పెన్సరీ ఫర్ సిక్ యానిమల్స్' అనే సంస్థ డిక్కిన్ మెడల్ అందజేసింది.
- ప్రఖ్యాత చిత్రకారులు పాబ్లో పికాసో, రాయ్ లిచెట్స్టెయిన్, డేవిడ్ హాక్నీ గీసిన సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన చిత్రాలు ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. 10 మిలియన్ల కలెక్షన్లు.. 21 లైబ్రరీలు నామరూపాలు లేకుండా పోయాయి.
- ఉగ్రదాడి జరిగి 18 ఏళ్లు ముగుస్తున్నా.. ఇప్పటికీ 40శాతం మంది బాధితుల ఆచూకీ లభ్యం కాలేదు. 1,113 మందిని ఇంకా గుర్తించలేదని ఓ నివేదిక పేర్కొంది.
- దాడి అనంతరం న్యూయార్క్‌లో విద్వేషపూరిత నేరాలు ఎక్కువయ్యాయి. సిక్కులు తలపాగా ధరించడం కారణంగా ముస్లింలుగా భావించి వారిపై దాడులు పెరిగాయి.
- మంటలు పూర్తిగా ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి 99 రోజులు పట్టింది.
- 3,051 మంది చిన్నారులు తమ తల్లి, తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయారు.
- ఈ భయానక ఘటనలో 343 అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: గాంధీ 150 : 'ఆరోగ్యమే మనిషికి అసలైన ఆస్తి'
Last Updated : Sep 30, 2019, 5:22 AM IST