ప్రభుత్వాల నుంచి మద్దతు లేనప్పటికీ అమెరికాలో గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్ఘారాలను తగ్గించే అవకాశం ఉందని 'అమెరికాస్ ప్లెడ్జ్' అనే సంస్థ తెలిపింది. 2005తో పోలిస్తే 2030 నాటికి ఉద్ఘారాలను 37 శాతం వరకు తగ్గించవచ్చని పేర్కొంది. అయితే జాతీయ సమగ్ర వాతావరణ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేయగలిగే నాయకుడిని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ద్వారా భూతాపానికి కారణమవుతున్న ఉద్ఘారాలను 49శాతం వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో దిగనున్నట్లు ప్రకటించిన అమెరికా బిలియనీర్ మైఖేల్ బ్లూమ్బర్గ్ ఆర్థిక సహాయంతో నడిచే 'అమెరికాస్ ప్లెడ్జ్' అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
డెమోక్రాట్ అధ్యక్షుడితో సాధ్యం
అమెరికా ప్రభుత్వ విధానంలో స్థానిక విద్యుత్ ఉత్పత్తులలో శిలాజ ఇంధనాల వాడకానికి వ్యతిరేకంగా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుంది. అయితే ఇతర ముఖ్యమైన నిర్ణయాత్మక సంస్కరణలు అమలు చేసే అధికారం పూర్తిగా సమాఖ్య వ్యవస్థ పరిధిలోకి వస్తుంది. డెమోక్రటిక్ అభ్యర్థిని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ద్వారా 2050 సంవత్సరం నాటికి కార్బన్ న్యూట్రాలిటీని అందుకోవడానికి అవసరమైన చట్టాలు రూపొందించే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.