South africa president covid: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా.. కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో ఉన్న ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ కలవరం సృష్టిస్తున్న వేళ.. ఆ దేశాధ్యక్షుడికి కొవిడ్ సోకడం చర్చనీయాంశంగా మారింది.
"రామఫోసా అనారోగ్యంగా ఉండగా.. ఆదివారం కొవిడ్ పరీక్షలు నిర్వహించాం. అందులో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కేప్‌టౌన్‌లో ఆయన ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నారు. దక్షిణాఫ్రికా మిలిటరీ హెల్త్ సర్వీసు అధికారులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు."
-దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం
Omicron variant: పూర్తిస్థాయి కరోనా టీకా తీసుకున్నప్పటికీ రామఫోసా కరోనా బారినపడటం గమనార్హం. అయితే.. ఆయనకు ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా? లేదా? అనే విషయాన్ని అధ్యక్ష కార్యాలయం వెల్లడించలేదు.
తనకు కరోనా సోకడం ప్రజలందరికీ ఓ హెచ్చరిక అని రామఫోసా పేర్కొన్నారని అధ్యక్ష కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ప్రజలంతా వైరస్‌ను ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రామఫోసా కోరారని చెప్పింది. అధ్యక్షుడిని ఇటీవల కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని స సూచించింది.