పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో సైనికులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దేశాధ్యక్షుడు ఇబ్రహీం బూబకర్ కీతా, ప్రధాని బూబౌ సిస్సేలను నిర్బంధించారు. సైనికుల దుశ్చర్యను ఆఫ్రికా సమాఖ్య ఛైర్మన్ మౌస్సా ఫకీ మహమత్ ఖండించారు.
"అధ్యక్షుడు బూబకర్, ప్రధాని సహా మాలి ప్రభుత్వ నేతల అరెస్టును ఖండిస్తున్నా. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా." అని మహమత్ పేర్కొన్నారు.
ఐరాస హామీ..
మాలి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ తెలిపారు. అధ్యక్షుడిని బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజాస్వామ్య సంస్థలను మాలి పౌరులు గౌరవించాలని కోరారు. దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పేందుకు భాగస్వామ్య పక్షాలతో ఐరాస కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
నలుగురి నేతృత్వంలో..
మాలియన్ సైనిక విభాగాలు మంగళవారం తిరుగుబాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. దేశంలోని అనేక మంది మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులను అరెస్టు చేసినట్లు రష్యా పత్రిక స్పుత్నిక్ వెల్లడించింది. సైనికుల ఆర్థిక సమస్యలకు సంబంధించి తిరుగుబాటు మొదలైనట్లు తెలుస్తోంది. దీనికి నలుగురు సైన్యాధికారులు నేతృత్వం వహిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.