ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2019కి గాను ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీని వరించింది. అంతర్జాతీయ సహకారం, శాంతి స్థాపనకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిచనున్నామని నోబెల్ కమిటీ ఛైర్పర్సన్ బెరిట్ రీస్-అండర్సన్ వెల్లడించారు. నార్వే రాజధాని ఓస్లో వేదికగా ఈ ప్రకటన విడుదల చేశారు.
పొరుగు దేశం ఎరిట్రియాతో సరిహద్దు విషయమై నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా అబీ అహ్మద్‌కు ఈ అరుదైన గౌరవం దక్కింది.
1998-2000 మధ్య ఎరిట్రియాతో యుద్ధం తర్వాత దాదాపు 20 ఏళ్లపాటు రెండు దేశాల మధ్య కొనసాగిన సైనిక ఉద్రిక్తతలకు గతేడాది ముగింపు పలికారు అహ్మద్. గతేడాది ఎరిట్రియాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇథియోపియా.
డిసెంబరులో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు అబీ అహ్మద్. పురస్కారం కింద అహ్మద్‌కు దాదాపు 6.48 కోట్ల రూపాయల నగదు బహుమానం లభిస్తుంది.