తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈజిప్టు చారిత్రక నగరం అలెగ్జాండ్రియాకు ఆపద - alexandria city

ఈజిప్టు తీరనగరం అలెగ్జాండ్రియాను దాదాపు 2 వేల ఏళ్ల కింద అలెగ్జాండర్​ చక్రవర్తి నిర్మించాడు. ఎంతో ఘనచరిత్ర కలిగిన ఈ నగరం..ప్రస్తుతం వాతావరణ మార్పు రూపంలో ఆపదను ఎదుర్కోబోతుంది. సముద్ర మట్టం పెరుగుతున్నందున నగరంలోని ప్రాంతాలు, పురావస్తు ప్రదేశాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. సముద్ర అలలను అదుపులో పెట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఈజిప్టు చారిత్రక నగరం అలెగ్జాండ్రియాకు ఆపద

By

Published : Sep 16, 2019, 5:30 AM IST

Updated : Sep 30, 2019, 6:53 PM IST

ఈజిప్టు చారిత్రక నగరం అలెగ్జాండ్రియాకు ఆపద

అలెగ్జాండ్రియా...ఈజిప్టులో మధ్యధరా సముద్ర తీరంలో ఉండే ఈ నగరానికి ఎంతో ఘనచరిత్ర ఉంది. ఈజిప్టులో రెండో పెద్ద నగరమైన దీన్ని అలెగ్జాండర్​ చక్రవర్తి 2వేల ఏళ్ల కిందట కట్టించారు. ఘనమైన చారిత్రక సంపద ఈ నగరం సొంతం. మూడు వైపులా మధ్యధరా సముద్రంతో దాదాపు 60 కిలోమీటర్ల తీరంతో ఉండే అలెగ్జాండ్రియాకు వేసవికాలంలో అధికంగా పర్యటకులు వస్తుంటారు.

ఒకప్పుడు దాడులు, భూకంపాలు వంటి ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొన్న అలెగ్జాండ్రియా నగరానికి ప్రస్తుతం ఆపద పొంచి వుంది. వాతావరణ మార్పు సహా ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి ఈ నగరంలో ప్రాచుర్యంలో ఉన్న పలు బీచ్​లు ఇప్పటికే అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు నగరంలోని ప్రాంతాలు, పురావస్తు ప్రదేశాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. దీన్ని అధిగమించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. సముద్ర అలలను అదుపు చేసేందుకు సన్నద్దమవుతున్నారు.

అనేక పురాతన కట్టడాలు..

అలెగ్జాండర్​ నగరంలో సముద్రపు ఒడ్డున అనేక పురాతన కట్టడాలున్నాయి. 15వ శతాబ్దంలో రక్షణ కోటగా ఉన్న కైత్బే సిటాడెల్ ఈ నగరంలోనే ఉంది. ప్రస్తుతం దీన్ని మ్యూజియంగా ఉపయోగిస్తున్నారు. సముద్రం ముందుకు రావడం వల్ల వీటికి ముప్పు ఏర్పడుతుంది. నగర తీరాలను భద్రపరచడానికి ఈజిప్ట్ తీర రక్షణ సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సముద్రంలో అలలను నిరోధించడానికి కాంక్రీట్ దిమ్మెలతో అడ్డుగోడలు కడుతున్నారు. దీనివల్ల అలెగ్జాండ్రియా తీరంలో సముద్ర మట్టాలు పెరగడం వల్ల కోల్పోయిన ఇసుక తీరాలను పునర్నిర్మించడానికి అవకాశం ఉంటుందని.. భవిష్యత్తులో తీరం ఏ విధమైన కోతకు గురి కాకుండా కాపాడుతుందని అధికారులు చెబుతున్నారు.

రూ.120 కోట్ల డాలర్లు కేటాయింపు

కైత్బే సిటాడెల్​ ఒక పెద్దరాయిపై నిర్మితమైంది. గత కొన్ని సంవత్సరాలుగా భారీ అలల వల్ల ఆ రాయి కోతకు గురవుతోంది. ఆ తర్వాత రాయిలో పగుళ్లు ఏర్పడి కూలిపోయే ప్రమాదం ఉంది. అంతిమంగా అది సిటాడెల్ నాశనానికి కారణమవుతుంది. తీర ప్రాంతాన్ని రక్షించడానికి ఈజిప్టు ప్రభుత్వం 120 మిలియన్ డాలర్లు కేటాయించింది.

ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న సముద్ర మట్టం

ప్రపంచంలో సముద్రమట్టాలు 2100 కల్లా 0.28 మీటర్ల నుంచి 0.98 మీటర్ల వరకు పెరుగుతాయని ఐక్య రాజ్య సమితి అంతర్​ మంత్రిత్వ మండలి హెచ్చరించింది. తీర ప్రాంత నగరాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వెల్లడించింది. అలెగ్జాండ్రియాలో దీని ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపించింది. 1993 వరకు ఏటా సగటున 1.8 మిల్లీమీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చిందని ఈజిప్టు నీటివనరుల, నీటి పారుదల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా 2.1 మిల్లీమీటర్లు ముందుకు రాగా..2012 నుంచి ప్రమాదకర స్థాయిలో 3.2 మిల్లీమీటర్ల మేర చొచ్చుకువస్తోంది. ప్రవాహానికి ఎదురుగా కట్టిన ఆనకట్టలతో పూడిక పెరిగిపోవడం, సహజ వాయువు వెలికితీత వల్ల అలెగ్జాండ్రియా నిర్మితమైన భూమి, చుట్టుపక్కల ఉన్న నైలు నది డెల్టా సుమారుగా అదే రేటుతో మునిగిపోతోంది. ఇది సముద్ర మట్టం పెరుగుదల ప్రభావాలను తీవ్రం చేస్తుందని, విపత్కర పరిణామాలను కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

నైలు నది డెల్టా 2050 నాటికి 734 చదరపు కిలోమీటర్లు, ఈ శతాబ్దం చివరి నాటికి 2 వేల 660 చదరపు కిలోమీటర్ల మేర మునిగిపోయే అవకాశముందని 2018లో ఓ అధ్యయనం అంచనా వేసింది. ఇది 5.7 మిలియన్ల ప్రజలను ప్రభావితం చేస్తుంది.

Last Updated : Sep 30, 2019, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details