ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న సమయంలోనే వందల సంఖ్యలో ఏనుగులు మృత్యువాతపడటం కలవరపెడుతోంది. ఆఫ్రికా ఖండంలోని బోట్సువానాలో గడిచిన రెండు నెలల్లోనే దాదాపు 350 ఏనుగులు మరణించినట్లు గుర్తించారు. అయితే, అవి మానవులు వేటాడటం వల్ల చనిపోయిన ఆనవాళ్లు కనిపించలేదని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించారు. ఇలా వందల సంఖ్యలో ఏనుగులు ఏ కారణంగా చనిపోతున్నాయనే విషయం ప్రస్తుతం మిస్టరీగా మారింది. దీంతో అప్రమత్తమైన అక్కడి ప్రభుత్వం కారణాలను కనుగొనే పనిలోపడింది.
ఈ స్థాయిలో ఏనుగులు చనిపోవడానికి వేటగాళ్లే కారణమని మొదట భావించారు. ఇకవేళ వేటగాళ్లు జరిపే విష ప్రయోగాలవల్ల వేరే జంతువులు కూడా మరణించాలి. కానీ, ఇక్కడ అలాంటి దాఖలాలేవి కనిపించలేదు. అంతేకాకుండా ఏనుగుల దంతాలు అలాగే ఉండడంతో వీటి మరణానికి మరేదో కారణమై ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. గతంలో ఈ ప్రాంతంలో ఏనుగులపై ఆంత్రాక్స్, వేటగాళ్ల విషప్రయోగం ఘటనలను కొట్టిపారేయలేమని పరిశోధకులు అభిప్రాయడుతున్నారు.
అచేతనంగా పడి ఉన్న ఏనుగులు..
తొలుత మే నెల ప్రారంభంలో బ్రిటన్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్ నియాల్ మెకాన్ 'ఒకవాంగో డెల్టా' ప్రాంతంలో విమానంలో ప్రయాణిస్తూ 169 ఏనుగు మృతదేహాలను గుర్తించారు. దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన ఈ ప్రయాణంలో అధిక సంఖ్యలో ఏనుగులు అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే అక్కడి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. అనంతరం నెలరోజుల పాటు చేసిన పరిశోధనలో దాదాపు 356 ఏనుగు మృతదేహాలను కనుగొన్నారు. చనిపోయిన వాటిలో భిన్న వయస్సుగల ఏనుగులు, ఆడ, మగవీ ఉన్నట్లు గుర్తించారు. వీటి మరణానికి కచ్చితమైన కారణం తెలియనప్పటికీ ఏనుగుల నాడీ వ్యవస్థపై ఏదో దాడి చేయడంవల్లే ఇవి మరణిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. విగతజీవులుగా పడి ఉన్న వాటి ముఖాలను పరిశీలిస్తే ఇదేవిషయం అర్థమవుతోందని డాక్టర్ నియాల్ మెకాన్ అభిప్రాయపడ్డారు.