ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియా కథలకు చిరునామాగా నిలుస్తున్న కథానాయిక సమంత. ‘ది ఫ్యామిలీమెన్ 2’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో బిజీ బిజీగా గడిపేస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతుండగా.. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ‘యశోద’ తుది దశ చిత్రీకరణలో ఉంది. కెరీర్ ఆరంభం నుంచీ నటనా ప్రాధాన్యమున్న పాత్రలతోనే అలరిస్తూ వస్తోంది నటి సాయి పల్లవి. కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే ఈ అమ్మడు.. ఇప్పుడు ఓ బహు భాషా చిత్రానికి పచ్చజెండా ఊపింది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘గార్గి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవలే సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తొలి అడుగులోనే..:‘అందాల రాక్షసి’గా వెండితెరపై మెరిసిన సుందరి లావణ్య త్రిపాఠి. ఇన్నాళ్లు గ్లామర్ నాయికగా తెరపై జోరు చూపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు పంథా మార్చింది. నాయికా ప్రాధాన్య కథలతో సత్తా చాటేందుకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంగా ‘హ్యాపీ బర్త్‌డే’ అంటూ నేరుగా పాన్ ఇండియా మార్కెట్‌కు నిచ్చెన వేసింది. ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ ప్రాధాన్యమున్న క్రైమ్ కామెడీ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం.. ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. దీన్ని పాన్ ఇండియా సినిమాగా జులై 15న ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయనున్నారు.