షారుక్ ఖాన్ - దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. జనవరి 25న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి వస్తోన్న పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ దీపిక ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఇందులో భాగంగా ఆమె.. వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న 'బేషరమ్ రంగ్' పాటపై స్పందించింది. ఆ పాటలో మనం చూస్తున్న దానికి లొకేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని వివరించింది.
షారుక్‌తో మీ అనుబంధం ఎలాంటిది?
దీపిక: ఆయనపై నాకున్న అభిమానాన్ని మాటల్లో వర్ణించలేను. ఆయనతో నాది ఎన్నో ఏళ్ల నాటి అనుబంధం. 'ఓం శాంతి ఓం' నుంచి ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో కలిసి నటించే అవకాశం మా ఇద్దరికీ దక్కడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నా. ఒక ప్రేక్షకురాలిగా ఆయన్ని స్పై, యాక్షన్ థ్రిల్లర్‌లో చూడటానికి నేను ఇష్టపడతాను. ఇప్పుడు, అలాంటి కథలోనే ఆయనతో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది.
సిద్ధార్థ్ ఆనంద్ గురించి మాట్లాడగలరు?
దీపిక: సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నా రెండో చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శతక్వం వహించారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత 'పఠాన్' కోసం ఆయనతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. త్వరలోనే మా ఇద్దరి కాంబోలో మరో సినిమా రానుంది. 'ఫైటర్' అనే టైటిల్ ఖరారు చేశాం. జీవితంలో ఏం సాధించాలనే విషయంలో అతనికి ఓ క్లారిటీ ఉంది.