RGV On KCR Biopic: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌ను ఎన్నికలకు ముందు తీస్తానని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. నిజ జీవితం ఆధారంగా తీసే సినిమా కావడం వల్ల స్క్రిప్ట్ పెద్ద కష్టమేం కాదని.. తన మెదడులోనే ఉంటుందన్నారు. 'డేంజరస్' సినిమా ట్రైలర్ విడుదలను దిల్లీ ఆంధ్రా అసోసియేషన్ భవనంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. స్వలింగ సంపర్కం నేరం కాదని 2018లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో డేంజరస్ సినిమా తీయాలనే ఆలోచన తనకు వచ్చిందన్నారు. ఇద్దరి మహిళల మధ్య ప్రేమను సమాజం ఇప్పుడిప్పుడే అంగీకరిస్తోందన్నారు. ఏప్రిల్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఈ సినిమాను త్వరలో ఓటీటీలోనూ విడుదల చేస్తామని వెల్లడించారు. హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ.. ఎల్‌జీబీటీ ఉద్యమానికి తాను మద్దతు తెలిపానన్నారు. హీరోయిన్ నైనా గంగూలీ మాట్లాడుతూ.. అమ్మాయితో రొమాన్స్ నడిపే పాత్ర చేయడం చాలా కష్టమన్నారు.
Pawan Kalyan New Movie: వరుస సినిమాలతో మళ్లీ బిజీ కానున్నారు పవన్‌కల్యాణ్. 'హరి హర వీర మల్లు' కొత్త షెడ్యూల్ కోసం రంగంలోకి దిగనున్నారు. కొత్తగా ఒప్పుకొన్న సినిమాల్ని పట్టాలెక్కించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'హరి హర వీర మల్లు' ఇప్పటికే యాభై శాతానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగిలిన భాగాన్ని పూర్తి చేయడం కోసం, ఉగాది తర్వాత కొత్త షెడ్యూల్‌ని ఆరంభించనున్నారు. అందుకోసం కళాదర్శకుడు తోట తరణి నేతృత్వంలో పలు సెట్స్‌ని తీర్చిదిద్దుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్ 6 నుంచి హైదరాబాద్‌లోనే చిత్రీకరణ షురూ కానున్నట్టు తెలిసింది. ఇది పూర్తయ్యేలోపే మరో కొత్త సినిమాని మొదలు పెట్టాలనే వ్యూహంతో ఆయన ఉన్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో 'హరి హర వీర మల్లు' తెరకెక్కుతోంది. ఎ.దయాకర్‌రావు నిర్మిస్తుండగా, ఎ.ఎం.రత్నం ఈ చిత్రానికి సమర్పకులు.