Telugu Heros on Police Roles: "హీరోయిజం ఒక్కో చిత్రంలో ఒక్కో తరహాలో కనిపిస్తుంటుంది. అసలు సిసలు నిఖార్సైన హీరోయిజం మాత్రం పోలీస్ పాత్రల్లోనే దాగి ఉంటుంది." అంటుంటారు సినీ విశ్లేషకులు. అందుకే తమ అభిమాన కథానాయకులు ఖాకీ చొక్కాలో దర్శనమిస్తే చాలు.. పూనకాలతో ఊగిపోతుంటుంది ప్రేక్షకలోకం. ఈ కారణంగానే అవకాశం దొరికినప్పుడల్లా పోలీస్ కథల్లో ఒదిగిపోయే ప్రయత్నం చేస్తుంటారు మన కథానాయకులు. 'గబ్బర్ సింగ్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాల్లో ఖాకీ తొడిగి, తన లాఠీ పవర్ రుచి చూపించారు పవన్ కల్యాణ్. ఆయన ఇటీవలే 'భీమ్లానాయక్'తో ముచ్చటగా మూడోసారి పోలీస్‌గా కనిపించి.. మురిపించారు. 'ఆర్ఆర్ఆర్' కోసం కథానాయకుడు రామ్చరణ్తోనూ పోలీస్ చొక్కా తొడిగించారు దర్శకుడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది.
Prabhas News: ఇటు ప్రేమ కథలతోనూ.. అటు యాక్షన్ కథాంశాలతోనూ సత్తా చాటారు కథా నాయకుడు ప్రభాస్. ఆయన ఇప్పటి వరకు పోలీస్ పాత్రలో కనిపించింది లేదు. ఇప్పుడా లోటును 'స్పిరిట్'తో భర్తీ చేయనున్నారాయన. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న పాన్ ఇండియా చిత్రమిది. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి, లాఠీ ఝుళిపించనున్నారు ప్రభాస్.
Hero Ram News: ఇప్పుడీయన బాటలోనే పోలీస్‌గా వెండితెరపై హీరోయిజం ప్రదర్శించేందుకు ఊవ్విళ్లూరుతున్నారు హీరో రామ్ పోతినేని. లింగుస్వామి దర్శకత్వంలో ఆయన చేస్తున్న కొత్త చిత్రం 'ది వారియర్'. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ ద్విభాషా చిత్రంలో శక్తిమంతమైన పోలీస్ అధికారిగా సందడి చేయనున్నారు రామ్. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఖాకీ కుర్రాళ్లు:ప్రస్తుతం వెండితెరపై యూనీఫాంతో సందడి చేయనున్న వారిలో యువ కథానాయకులే ఎక్కువ ఉన్నారు. 'వీరభోగ వసంతరాయలు', 'వి' సినిమాల్లో ఖాకీ దుస్తుల్లో కనిపించి అలరించారు హీరో సుధీర్‌బాబు. ఇప్పుడాయన ముచ్చటగా మూడోసారి అలాంటి పాత్రతో హీరోయిజం చూపించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన హీరోగా మహేష్ ఓ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. దీన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకొంటోంది. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో సుధీర్ ఓ శక్తిమంతమైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.