తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హీరోయిన్ల డబుల్‌ ట్రీట్‌.. నెల వ్యవధిలోనే రెండోసారి! - రాశీఖన్నా సినిమాలు

ఓ వైపు జోరుగా వానలు.. మరోవైపు బాక్సాఫీస్‌ ముందు కొత్త చిత్రాల సందడి. ఎటు చూసినా ఓ ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపిస్తోంది. ఇప్పుడీ చల్లని గాలుల్లో సినీప్రియులకు పసందైన వినోదాల్ని కొసరి కొసరి వడ్డించనున్నారు కథానాయికలు. వరుసగా రెండేసి చిత్రాలతో డబుల్‌ ట్రీట్‌ అందివ్వనున్నారు.

sai pallavi movies
sai pallavi movies

By

Published : Jul 11, 2022, 6:54 AM IST

అభిమాన తారలు వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేస్తుంటే సినీప్రియులకు కిక్కే కిక్కు. అదే నెల వ్యవధిలోనే రెండేసి చిత్రాలతో వారిని చూసుకునే అవకాశం వస్తే.. అంతకంటే కావాల్సింది ఏముంది. ఇప్పుడిలా వరుస సినిమాలతో అలరించేందుకు పలువురు కథానాయికలు సిద్ధమయ్యారు.

'మాచర్ల నియోజకవర్గం' చిత్రాని కంటే ముందుగానే 'బింబిసార'తో ప్రేక్షకుల్ని పలకరించనుంది నటి కేథరిన్‌. కల్యాణ్‌రామ్‌ హీరోగా వశిష్ఠ తెరకెక్కించారు. వర్తమానానికి, చరిత్రకు ముడిపెడుతూ ఓ విభిన్నమైన పీరియాడికల్‌ డ్రామాగా తీశారు. ఇందులోనూ ఇద్దరు నాయికలున్నారు. ఓ పాత్రను సంయుక్తా మేనన్‌ పోషించగా.. మరో పాత్రలో కేథరీన్‌ నటించింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది.

మరొకటి మిగిలే ఉంది..:
ఇటీవలే తమ చిత్రాలతో బాక్సాఫీస్‌ ముందు సందడి చేశారు సాయిపల్లవి, రాశి ఖన్నా, అవికా గోర్‌, సంయుక్తా మేనన్‌. ఇప్పుడీ ముద్దుగుమ్మలంతా నెల తిరగకుండానే మరో ప్రాజెక్టుతో మురిపించేందుకు సిద్ధమయ్యారు.

''నేను వెన్నెల.. ఇది నా కథ'' అంటూ ఇటీవలే 'విరాట పర్వం'తో ప్రేక్షకుల్ని పలకరించింది నటి సాయిపల్లవి. ఇప్పుడు 'గార్గి'తో మరో హృద్యమైన కథ చూపించేందుకు సిద్ధమైంది. గౌతమ్‌ రామచంద్ర తెరకెక్కించిన బహుభాషా చిత్రమిది. దీన్ని తెలుగులో నటుడు రానా సమర్పిస్తున్నారు. తప్పుడు కేసులో అరెస్టయిన తండ్రిని విడిపించుకోవడం కోసం ఓ కూతురు చేసే న్యాయ పోరాటమే ఈ కథాంశం. ఇది జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈనెల తొలి వారమే 'పక్కా కమర్షియల్‌'తో రాశి ఖన్నా, 'టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌'తో అవికా గోర్‌ బాక్సాఫీస్‌ ముందు తలపడిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలు వారికి చేదు ఫలితాల్నే రుచి చూపించాయి. వీళ్లిద్దరూ ఇప్పుడు 'థ్యాంక్‌ యూ'తో మరోసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. నాగచైతన్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కించారు. వినూత్నమైన ప్రేమ కథతో రూపొందిన ఈ చిత్రంలో చైతూ మూడు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా రాశి కనిపించనుండగా.. అవికా, మాళవికా నాయర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా జులై 22న విడుదల కానుంది.

'ఉప్పెన'తో తొలి అడుగులోనే భారీ విజయాన్ని అందుకొని.. ఇటు చిత్రసీమను అటు సినీప్రియుల్ని ఆకర్షించింది నటి కృతి శెట్టి. 'శ్యామ్‌ సింగరాయ్‌', 'బంగార్రాజు'లతో హ్యాట్రిక్‌ కొట్టేసింది. ఇప్పుడు 'ది వారియర్‌', 'మాచర్ల నియోజకవర్గం' చిత్రాలతో జైత్ర యాత్ర కొనసాగించేందుకు ఉవ్విళ్లూరుతోంది. వీటిలో తొలుత ప్రేక్షకుల ముందుకొచ్చేది 'ది వారియర్‌'. రామ్‌ హీరోగా లింగుస్వామి తెర కెక్కించిన యాక్షన్‌ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం జులై 14న విడుదల కానుంది. ఆర్జే విజిల్‌ మహాలక్ష్మిగా కృతి సందడి చేయనుంది. ఇది విడుదలైన నెలలోపే 'మాచర్ల నియోజకవర్గం'తో మరోసారి తెరపైకి రానుంది నటి కృతి శెట్టి. నితిన్‌ హీరోగా నటించిన చిత్రమిది. ఎమ్‌.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించారు. ఆగస్టు 12న విడుదలవుతోంది. ఇందులో ఇద్దరు కథానాయికలుండగా.. ఓ పాత్రలో కేథరిన్‌ నటించింది. మరో పాత్రను కృతి పోషించింది. ఈ రెండింటిపై ఆమె భారీ అంచనాలే పెట్టుకుంది.

ఈ ఏడాది ఆరంభంలోనే 'భీమ్లానాయక్‌'తో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకుంది నటి సంయుక్తా మేనన్‌. తాజాగా ఆమె 'కడువా'తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రమిది. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఇక దీని తర్వాత సంయుక్తా నుంచి రానున్న మరో చిత్రం 'బింబిసార'.

ఇదీ చదవండి:బాలీవుడ్​లో 'సౌత్​' ఫ్లేవర్​.. బీటౌన్​లో బిగ్​ ఎంట్రీ ఇస్తున్న భామలు వీరే!

ABOUT THE AUTHOR

...view details