Foreign actress in Tollywood: తెలుగు తెర నిత్యం నవ యవ్వనంతో తళుకులీనుతుండాలన్నది సినీప్రియుల కోరిక. అందుకే ప్రతీ చిత్రానికి ఓ కొత్త అందాన్ని పరిచయం చేసి.. ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఏటా ఎందరు కొత్త భామలు తెలుగులోకి అడుగు పెడుతున్నా.. నాయికల కొరత కనిపిస్తూనే ఉంటోంది. దీనికి తోడు ఇటీవల కాలంలో సినిమాల విషయంలో వేగం పెంచారు కథానాయకులు. అగ్రహీరో.. కుర్రహీరో అని తేడాల్లేకుండా ప్రతి ఒక్కరూ ఏకకాలంలో రెండు, మూడు చిత్రాలతో సెట్స్‌పై బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీంతో ప్రతి చిత్రానికి ఓ కొత్త సోయగాన్ని వెతికి పట్టుకు రావాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇప్పుడీ నాయికా లోటును భర్తీ చేసే క్రమంలో.. విదేశీ అందాల్నీ రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు దర్శక నిర్మాతలు.
సినిమాకి కొత్త కథానాయిక కావాలంటే చాలు.. ఉత్తరాది వైపో లేదంటే తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల వైపో దృష్టి సారిస్తుంటారు దర్శక నిర్మాతలు. అప్పుడప్పుడూ ఈ అందాల వేట సరిహద్దులు దాటేస్తుంటుంది. కథ డిమాండ్ మేరకు.. వీలుంటే ఏ అమెరికన్ భామనో.. లేదంటే ఏ బ్రిటీష్ అమ్మడినో తెలుగు తెరకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడిలా తెలుగు తెరపైకి వచ్చి వాలుతున్న విదేశీ నాయికల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిజానికిది మన చిత్రసీమకు కొత్తేమీ కాదు. 'మల్లీశ్వరి'తో మురిపించిన కత్రినా కైఫ్, 'కరెంటు తీగ'తో తళుక్కున మెరిసిన సన్నీలియోన్, 'ఎవడు' చిత్రంతో అలరించిన అమీ జాక్సన్, 'తిక్క'తో మెరిసిన లారిస్సా బోనేసి.. వంటి వారంతా విదేశాల నుంచి తెలుగు తెరపై సందడి చేసిన వారే. ఇటీవల 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మరో విదేశీ అందం ఒలీవియా మోరిస్. ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా జెన్నీఫర్ అనే బ్రిటిష్ యువతి పాత్రలో నటించిన ఈ ఇంగ్లాండ్ సొగసరికి.. ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలే దక్కాయి.
కార్తికేయన్‌తో... ఉక్రెయిన్ సోయగం:తమిళంలో వైవిధ్యభరిత కథలకు చిరునామాగా నిలిచే హీరో శివ కార్తికేయన్. ఇప్పుడాయన 'జాతి రత్నాలు' ఫేమ్ అనుదీప్ తెరకెక్కిస్తున్న చిత్రంతో నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపు కొంటోంది. ఈ సినిమాతోనే సినీప్రియుల్ని పలకరించనుంది ఉక్రెయిన్ సుందరి మరియా ర్యాబోషప్కా. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే రెండు ఉక్రెయిన్ సినిమాల్లో నటించిన మరియా.. 'స్పెషల్ ఓప్స్' అనే భారతీయ వెబ్ సిరీస్‌లోనూ కనిపించి మెప్పించింది. ఇప్పుడు శివ కార్తికేయన్‌కు జోడీగా తెలుగు తెరపైకి కాలుమోపనుంది. ఇదొక విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్. పుదుచ్చేరి, లండన్ నేపథ్యంలో సాగుతుంది. అందుకే కథకు తగ్గట్లుగా మరియాను ఎంపిక చేసుకుంది చిత్ర బృందం.