Suriya Visits Vijayakanth Memorial :కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఇటీవలే కన్నుముశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడ్డ ఆయన గత గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్ సౌత్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. అయితే షూటింగ్ కారణంగా విదేశాల్లో ఉండటం వల్ల విజయకాంత్‌కు తుది నివాళి అర్పించేందుకు సూర్య రాలేకపోయారు. దీంతో గురువారం చెన్నైకు చేరుకున్న ఆయన విజయకాంత్ సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటించారు.'కెప్టెన్'ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
"విజయకాంత్ నాకు పెద్దన్నతో సమానం. ఆయన మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కెరీర్ ప్రారంభంలో నేను నాలుగు సినిమాల్లో నటించినప్పటికీ నాకు ఎటువంటి గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలోనే నేను 'పెరియన్నా' అనే సినిమా కోసం తొలిసారి విజయకాంత్‌తో కలిసి పని చేశాను. సెట్‌లో ఆయనతో కలిసి భోజనం చేశాను. డ్యాన్స్, ఫైట్ బాగా చేయాలంటూ నన్ను ఆయన ఎంతగానో ప్రోత్సహించేవారు. ఆయన నాలో ఒ స్ఫూర్తిని నింపారు. అందరితో ఎంతో చక్కగా మాట్లాడేవారు. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు" అంటూ సూర్య విజయ్‌కాంత్‌ను గుర్తు చేసుకున్నారు.