యావత్ భారతావని కోరుకున్నట్టే ఆస్కార్ అవార్డ్ 'ఆర్ఆర్ఆర్'కు వచ్చేసింది. ఈ అద్భుతమైన ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రతి ఒక్కరూ ఆర్ఆర్ఆర్ టీమ్.. హీరోస్ ఎన్టీఆర్-రామ్ చరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్-కాలభైరవ, సంగీత దర్శకుడు కీరవాణి, లిరికిస్ట్ చంద్రబోస్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళిని.. ఇండియన్ సినిమా సత్తా చూపించారు అంటూ తెగ పొగిడేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆర్ఆర్ఆర్ టీమ్ పేర్లను జపిస్తూ ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ మనకు దక్కడానికి వెనక ఓ మాస్టర్ మైండ్ ఉందట. అతని పేరే ఎస్ఎస్ కార్తికేయ. ఆయన మరెవరో కాదు. జక్కన్న సినిమాలు, ఫ్యామిలీ గురించి తెలిసినోళ్లకు కార్తికేయ దాదాపుగా తెలుసు. కానీ సినీ ప్రేక్షకులందరికీ అతను పెద్దగా తెలియకపోవచ్చు. ఈయన వల్లే ఆస్కార్ సాధ్యమైందని అంటున్నారు. అసలు ఈయనకి.. ఆస్కార్ రావడానికి కారణమేంటంటే..
లాస్ ఏంజెల్స్‌లో ఎంతో ఘనంగా ఆస్కార్ అవార్డుల వేడుక జరిగిన విషయం తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరికిస్ట్ చంద్రబోస్ ఈ అవార్డును స్వీకరించారు. స్టేజీపై కీరవాణి మాట్లాడుతూ దర్శకుడు రాజమౌళితో పాటు కార్తికేయకు మాత్రమే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో చాలా మంది సినీ ఆడియెన్స్ కార్తికేయ గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఆయన రమా రాజమౌళి.. ఆమె మొదటి భర్తకు జన్మించారు. ఆ తర్వాత రమని వివాహం చేసుకున్న జక్కన్న.. కార్తికేయని సొంత కొడుకు కంటే ఎక్కువ చూసుకుంటున్నారు. వీరిద్దరు ఎంతో ప్రేమగా ఉంటారు. కొంతకాలం పాటు టెక్నీషియన్‌గా పనిచేసిన కార్తికేయ.. ప్రస్తుతం లైన్ ప్రొడ్యూసర్‌గా ఉంటున్నారు.