Bichagadu 2 : 'శీను', 'రోజాపూలు' వంటి పలు రొమాంటిక్ చిత్రాలతో ఆడియెన్స్‌ను అలరించారు దర్శకుడు శశి. 2013 తర్వాత తల్లీకొడుకుల అనుబంధం ఆధారంగా ఓ స్టోరీ రాసుకున్నారు. దాన్ని సినిమా మలిచేందుకు ఎందరో హీరోలను సంప్రదించారు. 'ఈ సినిమాలో మీది కోటీశ్వరుడిగా కనిపించే హీరో పాత్ర. మీరు చిటికేస్తే చాలు.. మీకు కావాల్సినవన్నీ ఇట్టే దగ్గరికీ వచ్చేస్తాయి' అని కథను చెప్పి ఉంటే.. హీరోలు అంగీకరించేవారేమో. కానీ అలా జరగలేదు. ఎందుకంటే ఈ చిత్రంలో హీరో బిలీనియరే అయినప్పటికీ.. తీవ్ర అనారోగ్యంతో మంచం పడిన తల్లిని కాపాడుకునేందుకు బిచ్చగాడు అవతారం ఎత్తాల్సి ఉంటుంది. మరి, బిచ్చగాడుగా కనిపించేందుకు ఏ హీరో మాత్రం సాహసం చేస్తాడు. దీంతో శశి డీలా పడిపోయారు. అపుడు 'నేనున్నానంటూ' విజయ్ ఆంటోనీ ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందే శశి.. తన 'డిష్యుం' సినిమాతో విజయ్ ఆంటోనీని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ స్నేహంతోనే.. శశి విజయ్‌కు స్క్రిప్టు వినిపించడం.. ఇద్దరి మధ్య చర్చలు జరగడం జరిగాయి. దీంతో కథ వింటున్నప్పుడే ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్న విజయ్.. సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయారు. తన భార్య ఫాతిమాను నిర్మాతగా పెట్టుకుని సినిమాను ప్రారంభించారు.
అక్కడ హిట్.. ఇక్కడ డబుల్ హిట్.. అంతా బాగునప్పటికీ.. టైటిల్ విషయంలో మళ్లీ పెద్ద చర్చ. 'బిచ్చగాడు' నేపథ్యమే.. ఈ కథకు కీలకం అవ్వడంతో అదే పేరును సినిమా టైటిల్‌గా పెట్టాలనుకున్నారు. కానీ శశి మనసులో ఎక్కడో భయం. ఆడియెన్స్ ఈ టైటిల్‌ను స్వీకరిస్తారా అని? అప్పటికే కొంతమంది విమర్శించారు కూడా. ఇక్కడ కూడా విజయ్.. శశికి సపోర్ట్ నిలుస్తూ.. 'పిచైక్కారన్' టైటిల్ పెట్టారు. కానీ ఈ టైటిల్‌తో సినిమా ప్రదర్శనకు కొన్ని థియేటర్ యాజమాన్యాలు అంగీకరించలేదు. అయినా అదే పేరుతో సినిమాను 2016 మార్చి 4న తమిళనాడులో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. సినిమా ఎమోషన్‌కు బాగా కనెక్ట్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయింది.
అయితే ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్‌కు చూపించాలనుకున్నారు. దీన్ని రీమేక్ చేయాలనుకున్నారు. శ్రీకాంత్‌లాంటి ప్రముఖ హీరోలతో కూడా చర్చలు జరిగాయి. కానీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో తెలుగులో డబ్ చేసి 'బిచ్చగాడు' పేరుతో 2016 మే 13న రిలీజ్ చేశారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దీన్ని విడుదల చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌కి మించిన విజయాం దక్కింది. విజయ్ ఆంటోనీ అనే హీరోను ఇక్కడివారికి పరిచయం చేసింది. తమిళ వెర్షన్ రూ. 16 కోట్లు(అంచనా) వసూలు చేస్తే.. తెలుగులో ఏకంగా రూ. 26 కోట్ల(అంచనా) వసూళ్ల వరకు సాధించింది. డబ్బింగ్ సినిమా అయి.. 100 రోజులకిపైగా ప్రదర్శితమైంది. ఇది మాములు విషయం కాదు. కథతోపాటు విజయ్ యాక్టింగ్, సాంగ్స్.. అన్నీ కీలక పాత్ర పోషించాయి. మరో విశేషమేమిటంటే.. ఈ సినిమాకు విజయ్ ఆంటోనీనే సంగీతం అందించారు. అప్పటికే ఆయన తెలుగులో 'మహాత్మ', 'దరువు'కు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.