Skanda Movie Review :Skanda movie review | చిత్రం: స్కంద; నటీనటులు: రామ్, శ్రీలీల, ప్రిన్స్ సిసిల్, సయీ మంజ్రేకర్, శరత్ లోహితాశ్వ, దగ్గుబాటి రాజా, ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు; సంగీతం: ఎస్. తమన్; ఎడిటింగ్: తమ్మిరాజు; సినిమాటోగ్రఫీ: సంతోష్ దేటేక్; నిర్మాత: శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమర్; రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను; విడుదల: 28-09-2023
మాస్ సినిమాలకి పెట్టింది పేరు... దర్శకుడు బోయపాటి శ్రీను. ఇక బోయపాటి మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన స్టోరీలో అటు మాస్‌తో పాటు ఇటు క్లాస్ ఆడియెన్స్‌ను అలరిస్తుంటారు. ఇక తాజాగా ఈయన ఎనర్జిటిక్ హీరో రామ్‌తో 'స్కంద' మూవీని రూపొందించారు. గురువారం ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రామ్ - బోయపాటి కాంబో మాస్ ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందంటే?
స్టోరీ ఏంటంటే : పెళ్లిపీటలపై కూర్చున్న ఆంధ్రప్రదేశ్ సీఎం కూతురిని... తెలంగాణ సీఎం అబ్బాయి వచ్చి తీసుకెళ్తాడు. దాంతో ఇద్దరి సీఎంల మధ్య విభేదాలు మొదలవుతాయి. ఒకరినొకరు అంతం చేసుకునే స్థాయి వరకు వెళుతుంది. ఇంతలోనే ఆంధ్రా సీఎం ఓ యువకుడిని రంగంలోకి దింపుతాడు. అతను మామూలోడు కాదు. ఎవ్వరినైనా ఎదురించి అనుకున్నది సాధించే రకం. ఆ యువకుడు కట్టుదిట్టమైన భద్రతని కాదని తెలంగాణ సీఎం ఇంట్లోకి అడుగు పెట్టాడా? ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుళ్లనీ కిడ్నాప్ చేసి రుద్రరాజపురం తీసుకెళ్లిన యువకుడు (రామ్) ఎవరు? ఇంతకీ ఆ ఊళ్లో ఎవరున్నారు? ఈ కిడ్నాప్‌లకీ క్రౌన్ గ్రూఫ్ కంపెనీస్ అధినేత రామకృష్ణంరాజు (శ్రీకాంత్)కీ మధ్య సంబంధం ఏమిటి? ఇటువంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే: మాస్ సినిమాకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందులో బోయపాటి మార్క్ మూవీస్ మరింత ప్రత్యేకం. ఆయన తన మూవీ మేకింగ్ స్టైల్‌తో తాను రూపొందించిన పాత్రలతో ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ని సృష్టించుకున్నారు. శక్తిమంతంగా కనిపించే ఆయన హీరోలు.. చిత్రాల్లో సూపర్‌మేన్ తరహాలో వీరవిహారం చేస్తుంటారు. పాత్రలు నడుచుకునే తీరునీ, పోరాట ఘట్టాల్ని లార్జర్ దేన్ లైఫ్ తరహాలో తెరపై ఆవిష్కరించి మాస్‌కి అసలు సిసలు సినిమాటిక్ అనుభూతిని పంచుతుంటారు. మరోవైపు తను చెప్పాలనుకున్న విషయాన్ని మంచి భావోద్వేగాలతో చెబుతుంటారు. ఇక 'స్కంద' సినిమాతోనూ ఆయన అదే ప్రయత్నం చేశారు. రామకృష్ణంరాజు పాత్రతో సినిమాని మొదలుపెట్టిన దర్శకుడు, ఇద్దరు ముఖ్యమంత్రుల్ని, వాళ్ల సామ్రాజ్యాన్ని ఆవిష్కరించాక హీరోని పరిచయం చేస్తాడు. అక్కడ నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య కాలేజీ డ్రామా, సాంగ్స్, యాక్షన్ సీన్స్, ఆసక్తికరమైన మలుపులతో ప్రథమార్ధాన్ని నడిపించారు దర్శకుడు. ఇక వర్తమాన రాజకీయాలు, ఉచిత పథకాలపై చురకలు వేస్తూ కొన్ని సన్నివేశాల్ని సైతం తీర్చిదిద్దారు.
రాహుల్, నవీన్, రామకృష్ణంరాజు తదితర పాత్రలతో నిజ జీవితంలోని కొంతమంది వ్యక్తులు గుర్తుకొస్తారు. ప్రథమార్ధం సినిమా బోయపాటి మార్క్ వీరోచిత పోరాట ఘట్టాలతో యాక్షన్ ప్రియుల్ని అలరిస్తుంది. ఇక విరామ సన్నివేశాలు సినిమాకే మరింత హైలైట్‌గా నిలుస్తాయి. సెకెండ్హాఫ్లోనే అసలు కథ ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కీలకం. ఆ ఎపిసోడ్స్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కట్టిపడేసేలా భావోద్వేగాల్ని పండించే ప్రయత్నాన్ని చేశారు. పిలిస్తే పనోడు పలకడం వేరు, సొంత కొడుకు పలకడం వేరు... వృద్ధాప్యంతో తల్లిదండ్రులు తడబడుతున్నప్పుడు పక్కన మనం లేకపోతే ఎలా? అంటూ పల్లెటూళ్లో తీర్చిదిద్దిన సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే మరో మలుపు సినిమాకి కీలకం. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని దర్శకుడు ప్రకటించారు.
ఎవరెలా చేశారంటే: తెలంగాణ యాసతోపాటు...రాయలసీమ యాసలోనూ సంభాషణలు చెబుతాడు రామ్. ఆయన పాత్ర ఇందులో పలుమార్లు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రెండు కోణాల్లో సాగే ఆ పాత్రలో రామ్ కనిపించిన విధానం, వైవిధ్యం ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బోయపాటి స్టైల్‌కి తగ్గట్టుగా మారిపోయి రామ్ .. పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ఇక ఆయన చేసిన పోరాట ఘట్టాలు, డ్యాన్స్‌లు సినిమాకి మరింత ఆకర్షణీయంగా నిలిచాయి. శ్రీలీల తన అందంతోనూ, డ్యాన్స్‌లతో అదరగొట్టారు. పాత్రకి తగినంత ప్రాధాన్యమే ఉన్నా, ఉన్నంతలో ఆకట్టుకున్నారు. సయీ మంజ్రేకర్ పల్లెటూరి పాటలోనూ... సినిమాకి కీలకమైన మలుపులోనూ ఆమె కనిపిస్తుంది. రామకృష్ణంరాజు పాత్రలో శ్రీకాంత్, రామ్ తండ్రిగా దగ్గుబాటి రాజా, ముఖ్యమంత్రుల పాత్రలో అజయ్ పూర్కర్, శరత్ లోహితాశ్వ తమ తమ ప్రాతల్లో మెరిశారు. గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్, ప్రభాకర్... ఇలా తెరపై బోలెడన్ని పాత్రలు కనిపిస్తాయి.
సాంకేతికంగా ఈసినిమా ఉన్నతంగా ఉంది. బోయపాటి సినిమాకి ఎలా కావాలో అలాంటి మ్యూజిక్‌ని సమకూర్చారు తమన్. సంతోశ్ దేటకే కెమెరా పనితనం బాగుంది. ప్రతీ సన్నివేశం ఘనంగా కనిపిస్తుంది. కూర్పు, ప్రొడక్షన్ డిజైన్... తదితర విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి తన మార్క్ మాస్ సినిమాపై పూర్తి పట్టుని ప్రదర్శించారు. కథ, కథనం, ఎలివేషన్స్‌తో కట్టిపడేశారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. పాన్ ఇండియా సినిమా స్థాయికి తగ్గట్టే ఘనంగా ఉంది.
- బలాలు
- +రామ్ నటన, డ్యాన్స్
- + బోయపాటి మార్క్ మాస్ అంశాలు
- +యాక్షన్... భావోద్వేగాలు
- బలహీనతలు
- -అక్కడక్కడా రొటీన్‌గా అనిపించే సన్నివేశాలు
- చివరిగా: స‌్కంద... మాస్ జాతర
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!