"సాయిపల్లవి ఒప్పుకోకపోతే 'విరాటపర్వం' చేసేవాడిని కాదు. సరళ పాత్రకు సాయిపల్లవి మాత్రమే న్యాయం చేయగలదనే నమ్మకంతోనే సినిమా తీశా. అది నిజమై, మా చిత్రం విజయం సాధించింది." అని దర్శకుడు వేణు ఊడుగుల అన్నారు. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలుగా వేణు ఊడుగుల దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'విరాటపర్వం'. సురేశ్ ప్రొడెక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. విప్లవ భావజాలంతో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'విరాటపర్వం' ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం 'విరాటపర్వం సక్సెస్ ప్రెస్‌మీట్' నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత సురేశ్ బాబు, సాయిపల్లవి, వేణు ఊడుగుల, తూము సరళ సోదరుడు మోహనరావు, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి పాల్గొన్నారు.
తొలి బయోపిక్: ఇందులో భాగంగా నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ.. "సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన మొదటి బయోపిక్ 'విరాటపర్వం'. రానా ఈ సినిమా ఓకే చేసిన తర్వాత "ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నావ్?" అని ప్రశ్నించాను. దానికి రానా.. 'ఈ పాత్రను పోషించడం నా బాధ్యత' అని చెప్పాడు. సినిమా విడుదలయ్యాక అందరి నుంచి వస్తోన్న స్పందన చూశాక మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చామనిపించింది" అని అన్నారు.
అనంతరం సాయి పల్లవి మాట్లాడుతూ.. "సరళ పాత్ర చాలా బరువైనదని ఆమె కుటుంబాన్ని కలిసినప్పుడు తెలిసింది. ఆ కుటుంబసభ్యులు నాపై చూపించిన ప్రేమను జీవితంలో మరిచిపోలేను. మా చిత్రాన్ని ఆదరించి, విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు" అని తెలిపారు.