హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్, భారతీయ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల ఓ కార్యక్రమంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియజేస్తూ ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. దీనిపై పలువురు స్పందిస్తూ.. భారతీయ సినిమాకు దక్కిన గొప్ప గౌరవం అంటూ కొనియాడుతున్నారు.
ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో జేమ్స్ కామెరూన్‌ను రాజమౌళి కలిశారు. ఆర్‌ఆర్‌ఆర్ గురించి వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందంటూ ఇందులోని పలు సీన్లను కామెరూన్.. జక్కన్నకు తెలియజేశారు. ఈ చిత్రాన్ని కామెరూన్ రెండుసార్లు చూసినట్లు ఆయన సతీమణి సుజీ కామెరూన్ వెల్లడించారు. వీరిద్దరి మాటలతో రాజమౌళి అమితానందం పొందారు. ఈ మొత్తం సంభాషణకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ శనివారం విడుదల చేసింది.
రాజమౌళి: టెర్మినేటర్, అవతార్, టైటానిక్.. ఇలా మీరు తెరకెక్కించిన అన్ని చిత్రాలను నేను చూశాను. అవి నాలో స్ఫూర్తి నింపాయి. మీ వర్క్ అంటే నాకెంతో ఇష్టం.
కామెరూన్: మీరు తెరకెక్కించిన చిత్రాలు, అందులోని పాత్రలు చూస్తుంటే విభిన్నమైన అనుభూతి కలిగింది. నిప్పు, నీరు, కథ.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి మీరు చూపించిన విధానం, బ్యాక్‌గ్రౌండ్ స్టోరీని చెప్పిన తీరు నాకెంతో నచ్చింది. స్నేహం, వైరాన్ని చూపించిన సన్నివేశాలు.. వావ్ అనేలా ఉన్నాయి.