Ranbir Alia wedding: మోస్ట్ క్రషింగ్ పెయిర్ ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ముంబయి, బాంద్రాలోని తమ నివాసంలో పంజాబ్ సంప్రదాయం ప్రకారం గురువారం వారి పెళ్లి తంతు జరిగింది. అతి తక్కువ మంది అతిథులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంది రలియా జంట. ప్రేమికులుగా ఐదేళ్ల నుంచి తాము ఊసులాడుకున్న బాల్కనీలోనే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టామని ఇన్‌స్టా వేదికగా ఆలియా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆలియా- రణ్‌బీర్‌లకు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొణె, కత్రినా కైఫ్‌లు సైతం ఆలియా- రణ్‌బీర్ జంటకు విషెష్ తెలిపారు. గతంలో రణ్‌బీర్‌తో డేటింగ్ చేసిన ఈ భామలు అతడి పెళ్లికి విషెష్ చెప్పడం.. నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం వారి పోస్టులు వైరల్‌గా మారాయి. ఆలియా భట్- రణ్‌బీర్ కపూర్ల పెళ్లి ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది కత్రినా కైఫ్. 'మీ ఇద్దరికీ అభినందనలు.. ప్రేమతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా.' అంటూ రాసుకొచ్చింది కత్రినా. తన పోస్ట్‌కు రెడ్‌హార్ట్ ఎమోజీలను జత చేసింది. మరోవైపు.. ఆలియా పెట్టిన ఇన్‌స్టా పోస్టుకు కామెంట్ చేసింది దీపిక. 'మీ జీవితాంతం ప్రేమానురాగాలు, ఆనందం ఉండాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొంది.