తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అది చెప్పడానికి హీరోగానే ఉండాల్సిన అవసరం లేదు: రానా

Rana saipallavi Virataparvam: నటుడిగా తాను మంచి కథలు చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు హీరో రానా. ప్రతిసారీ కొత్తదనం నిండిన పాత్రలతోనే ప్రేక్షకుల్ని అలరించాలనుందని చెప్పారు. ఆయన నటించిన తాజా చిత్రం 'విరాటపర్వం'. జూన్​ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగతులను తెలిపారు రానా. ఆ సంగతులివీ..

Rana saipallavi Virataparvam
రానా సాయిపల్లవి విరాటపర్వం

By

Published : Jun 12, 2022, 6:44 AM IST

Rana saipallavi Virataparvam: "నటుడిగా మంచి కథలు చెప్పాలనుకున్నా. అది హీరోగా ఉండే చెప్పాలనేం లేదు. ప్రతిసారీ కొత్తదనం నిండిన పాత్రలతోనే ప్రేక్షకుల్ని అలరించాలనుంది" అన్నారు నటుడు రానా దగ్గుబాటి. ఓ ఇమేజ్‌ ఛట్రంలో ఇరుక్కు పోకుండా ఇటు హీరోగా అటు విలన్‌గా విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ.. వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు రానా. ఇప్పుడాయన రవన్నగా 'విరాటపర్వం'తో అలరించేందుకు సిద్ధమయ్యారు. వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రమిది. సాయిపల్లవి కథానాయిక. జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు రానా.

'అరణ్య' కోసం అడవిలోకి అడుగు పెట్టారు. 'విరాటపర్వం'తో ఆ ప్రయాణాన్ని అలాగే కొనసాగించారు. ఎలా అనిపించింది?

"అడవులకూ నాకు ఏదో అనుబంధం ఉన్నట్లుంది (నవ్వుతూ). నాలుగేళ్లుగా నా సినిమా చిత్రీకరణలన్నీ ఎక్కువగా అడవుల్లోనే జరిగాయి. ఈ చిత్రానికి వచ్చేసరికి.. ఇది 90ల్లో జరిగే కథ. దళం సభ్యులు అడవుల్లో ఉండే రోజులవి. నాటి వాతావరణాన్ని చాలా యథార్థంగా తీశాం. నా కెరీర్‌లో తొలిసారి ఓ గొప్ప ప్రేమకథ చేశాను. ప్రేమ కోసం ఓ వ్యక్తి ఎంత దూరం వెళ్తాడు.. ఎంత త్యాగం చేస్తాడు? అన్నది ఇందులో ఆసక్తికరంగా చూపించారు. స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడే నా మనసు చాలా బరువెక్కినట్లు అనిపించింది. ఇటువంటి కథ నేనిప్పటి వరకు వినలేదు. ఇంత భారం ఎప్పుడూ తీసుకోలేదు".
మీ రవన్న పాత్రకు స్ఫూర్తి ఎవరు?
"రవన్నది యథార్థ పాత్ర కాదు. మేము సృష్టించినదే. చేగువేరా లాంటి నాయకుల స్ఫూర్తి ఆ పాత్రలో కనిపిస్తుంది. రవన్న ఒక డాక్టర్‌. అప్పుడున్న పరిస్థితులు అతన్ని కవిగా తర్వాత ఉద్యమ నాయకుడిగా మారుస్తాయి. నాకు నక్సల్‌ మూమెంట్‌ గురించి టీవీల్లో, వార్తాపత్రికల్లో వచ్చిన కొన్ని హైలెట్స్‌ మాత్రమే తెలుసు. వాళ్లు నిజంగా ఎలా ఉంటారు? యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులు నక్సల్స్‌గా ఎందుకు మారారు? ఇలాంటి వివరాల్లోకి వెళ్లలేదు. రవన్న కథలో మాటల రూపంలో ఇలాంటి వివరాలు కొన్ని తెలుస్తాయి. అలాగే కొంత పొలిటికల్‌ డ్రామా నడుస్తుంటుంది. కథలో ప్రధాన సారాంశం ప్రేమే".
సాయిపల్లవి చేసిన వెన్నెల పాత్ర ఎలా ఉండనుంది? జరీనా, ప్రియమణి తదితరుల పాత్రలెలా ఉంటాయి?
"సాయిపల్లవి గొప్ప నటి. ఈ చిత్రంలో ఆమె వెన్నెల పాత్ర మరోస్థాయిలో ఉంటుంది. నా రవన్న పాత్రని మరొకరు చేస్తారో లేదో తెలియదు కానీ, వెన్నెల పాత్రని సాయిపల్లవి తప్ప మరొకరు చేయలేరు. దీంట్లో మా పాత్రలకే కాదు.. మిగిలిన అన్ని పాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. జరీనా వహాబ్‌, ప్రియమణి, ఈశ్వరీ రావు, నందితా దాస్‌.. ఈ పాత్రలన్నీ చాలా బలంగా ఉంటాయి. ఇది మహిళా చిత్రం".

నటుడిగా అద్భుతం అనిపించుకున్నారు. సోలో హీరోగా ఆశించినంత కమర్షియల్‌ సక్సెస్‌ రాలేదని ఎప్పుడైనా అనుకున్నారా?"నేను హీరో అవ్వాలంటే నేను కొట్టే దీటైన విలన్‌ ఎవరో కనిపించలేదు. ఇది మొదటి సమస్య (నవ్వుతూ). ఓ మంచి కథని చెప్పడానికి హీరోగానే ఉండాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనేది నా కోరిక. నా నుంచి రానున్న సినిమాలన్నీ హీరోయిజం ఉండేవే. త్వరలో ‘హిరణ్యకశ్యప’ చేస్తున్నా. మార్చి నుంచి సెట్స్‌పైకి వెళ్తుంది. నాకు తెలిసి దానికంటే పెద్ద కమర్షియల్‌ సినిమా మరొకటి ఉండదు’’. ప్రత్యేకంగా ఇలాంటి జానర్స్‌ చేయాలి.. ఇవి చేయకూడదు అని ఏమైనా పరిమితులున్నాయా?"నాకు అన్ని జానర్స్‌ ఇష్టమే. అయితే చేసిన జానర్‌, పాత్ర మళ్లీ మళ్లీ చేయకూడదనుకుంటా. కథ సీరియస్‌గా జరుగుతున్నప్పుడు సడన్‌గా పాట వస్తే నేను బయటకు వెళ్లిపోతా. ఇవి నాకెక్కవు. అలాగే హీరోయిన్‌ని టీజింగ్‌ చేసినా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటివి నచ్చవు. మనం అశాశ్వతం. సినిమాలే శాశ్వతం. చాలా మంది గొప్ప నటులు వదిలేసిన గొప్ప విషయాలనే గుర్తుపెట్టుకుంటాం. అలా గొప్పగా గుర్తుపెట్టుకునేలా పని చేయాలని ఉంది’’. రవన్నది ఉద్యమ నేపథ్యం. అతని జీవితంలోకి ప్రేమ ఎలా ప్రవేశించింది?"రవన్న కావొచ్ఛు. అతని దళం సభ్యులు ఎవరైనా కావొచ్ఛు. వాళ్లంతా ఓ కచ్చితమైన లక్ష్యంతో జీవిస్తుంటారు. కుటుంబం, ప్రేమ, స్నేహ బంధాల కన్నా సమాజమే ముఖ్యమని జీవిస్తుంటారు. రవన్నది అలా సాగిన ప్రయాణమే. అనుకోకుండా అతని జీవితంలోకి వెన్నెల ప్రవేశించాక.. ఓ సందిగ్ధ పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుంది. లక్ష్యం కోసం పనిచేయాలా? కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవించాలా? అన్నది తేల్చుకోలేని పరిస్థితి. ఈ చిత్రం ఆ నైతిక సందిగ్ధతపైనే నడుస్తుంది. రవన్న పాత్రలో బలమైన ఎమోషన్స్‌ ఉంటాయి. ఈ సినిమా చూసి చప్పట్లు కొడతారో లేదో తెలియదు కానీ, ఇది నిజమే కదాని కచ్చితంగా భయపడతారు’’.

"పాన్‌ ఇండియా సినిమా తీయాలని నిర్ణయించుకుని తీస్తే అది వర్కవుట్‌ కాకపోవచ్ఛు ఎందుకంటే అది పాన్‌ ఇండియా అవుతుందా? లేదా? అన్నది కథే నిర్ణయించాలి. ప్రస్తుతం నేను వెంకటేష్‌ కలిసి నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌ విడుదలకు సిద్ధమవుతోంది. ఇదొక క్రైమ్‌ అండ్‌ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది".

ఇదీ చూడండి:అసలు ఆ షో ఉందనే తెలియదు.. కట్​ చేస్తే స్టార్​.. బ్లాక్​మెయిల్​ చేసి మరీ

ABOUT THE AUTHOR

...view details