వేతనాలు పెంపు, విధి విధానాల్లో మార్పులు కోరుతూ తెలుగు సినీ కార్మికులు చేపట్టిన సమ్మెపై నిర్మాతల మండలి స్పందించింది. కార్మికుల సమ్మె విషయంపై బుధవారం మధ్యాహ్నం సమావేశమైన నిర్మాతల మండలి అనంతరం మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. కార్మికులకు వేతనాలు పెంచడానికి తమకెలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రేపటి నుంచి కార్మికులందరూ షూటింగ్‌లో పాల్గొనాలని సూచించారు.
'సినీ కార్మికుల సమ్మె గురించి తెలుసుకుని మేమంతా షాకయ్యాం. సమయానుగుణంగా మేము తరచూ వేతనాలు పెంచుతూనే ఉన్నాం. అయితే, వేతనాల సడలింపుపై స్పందించమని కోరుతూ ఈనెల 6న వాళ్లు మాకు ఓ లేఖ రాశారు. వేతనాలు పెంచడానికి నిర్మాతలందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒక్కసారి అందరం కలిసి కూర్చొని చర్చించుకుందామని వాళ్లకు సమాధానం ఇచ్చాం. కానీ, వాళ్లందరూ ఈరోజు ఇలా ఆకస్మికంగా సమ్మె చేయడం తప్పు.
నిర్మాతలందరూ షూటింగ్స్ కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రేపటి నుంచి కార్మికులందరూ షూట్స్‌కి ఎప్పటిలాగా వస్తేనే వేతనాలు, విధివిధానాలపై ఎల్లుండి చర్చించి ఒక కొలిక్కి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటే.. షూటింగ్స్ చేయడానికి నిర్మాతలెవరూ సిద్ధంగా లేరు. నిర్మాతల్ని ఇబ్బందిపెట్టకండి.. వాళ్లు సినిమాలు చేస్తేనే మనకి పని ఉంటుంది. అలాగే, సమ్మె నోటీసులు మాకు పంపించినట్లు వాళ్లు చెబుతున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు' అని సి.కల్యాణ్ వివరించారు.