Ponniyin Selvan 2 Box Office Collection : ప్రముఖ దర్శకుడు మణిరత్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. ఈ సినిమా తొలి భాగం గతేడాది విజయవంతంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు రెండో భాగం 'పొన్నియిన్ సెల్వన్-2' కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తోంది. కోలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. 9వ శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ కథను కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా రూపొందించారు. పలువురు దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నించినప్పటికీ ఇది పట్టాలెక్కలేపోయింది. అయితే పలు ప్రయత్నాల తర్వాత ఈ సినిమాను విజయవంతంగా తెరకెక్కించారు దర్శకుడు మణిరత్నం.
ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సంపాదించడమే కాకుండా కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తోంది.ఓపెనింగ్‌లోనే అదిరిపోయే కలెక్షన్లను సొంతం చేసుకున్న 'పీఎస్-2'.. మూడు రోజుల్లో వచ్చేసరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లురాబట్టింది. ఇందులో తమిళ ప్రేక్షకుల షేర్ ఎక్కువగా నమోదైందని ట్రేడ్ వర్గాల టాక్. ఉత్తర అమెరికాలో ఈ సినిమా మూడు రోజుల్లో 3 మిలియన్ డాలర్లు(రూ.24 కోట్లు) వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3200 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో విడుదలైన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనే రూ.170కోట్ల మేర వసూళ్లు చేసినట్లు సమాచారం.