NTR On Politics Entry: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తారా.. అని అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రియాశీల రాజకీయాల్లోకి రావడంపై తాజాగా తారక్ స్పందించారు. 'ఆర్‌ఆర్‌ఆర్' ఘన విజయం సాధించిన సందర్భంగా తారక్ బాలీవుడ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌తో ఆయన ముచ్చటించారు.
సక్సెస్, ఫెయిల్యూర్ పట్టించుకోను:"నటుడిగా కెరీర్ ప్రారంభించి సుమారు 20 యేళ్లు అవుతోంది. 17 ఏళ్ల వయస్సలో పరిశ్రమలోకి వచ్చాను. ఆ సమయంలో హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా.. ఎక్కువగానే తీసుకునేవాడిని. కానీ, ఇప్పుడు దేనినైనా సులభంగా తీసుకోవడం అలవాటైంది. విజయం వచ్చినప్పుడు దక్కే ఆనందాన్ని, పరాజయం వచ్చినప్పుడు కలిగే బాధను.. ఆ క్షణానికే తీసుకుంటా. వెంటనే దాని నుంచి తేరుకొని మళ్లీ నా పని నేను చూసుకుంటాను. ప్రతి ఫెయిల్యూర్ ఏదో ఒకటి నేర్పుతుందని వ్యక్తిగతంగా నమ్ముతాను. ఒకసారి జరిగిన తప్పును గ్రహించి మళ్లీ ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా"
గేటు దాటితేనే ఎన్టీఆర్:"ప్రతిఒక్కరూ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేసుకుంటేనే సంతోషంగా ముందుకు వెళ్లగలమని నమ్ముతుంటాను. అదే మాదిరిగా సినిమా సెట్‌లో ఉన్నంతవరకే ఒక నటుడ్ని, 'ఎన్టీఆర్' అనే స్టార్‌ని అనుకుంటా. ఒక్కసారి సెట్ నుంచి బయటకు రాగానే నేనూ ఒక సాధారణ వ్యక్తినే అని భావిస్తా. ఇంటి గేటు దాటి బయటకు రాగానే మళ్లీ 'ఎన్టీఆర్' అని ఫీల్ కలుగుతుంది"