సినీ పరిశ్రమలో రీమిక్స్ ట్రెండ్ చాలా కాలం నుంచి నడుస్తున్న సంగతి తెలిసిందే. అలనాటి సూపర్‌హిట్ పాటలను రీమిక్స్ చేసి రిలీజ్ చేస్తుంటారు. అవి కూడా శ్రోతలను బాగా ఉర్రూతలూగిస్తుంటాయి. అయితే ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? మంచి రీమిక్స్ సాంగ్ ఉన్న 'అమిగోస్' చిత్రం ఈ నెల 10న విడుదలకాబోతుంది. 1992లో నందమూరి బాలకృష్ణ నటించిన గీతం.. కల్యాణ్‌రామ్ వెర్షన్‌లో ఎలా ఉంటుందో వెండితెరపై చూసేముందు ఆ కుటుంబ హీరోల్లో ఎవరెవరు ఏయే మధుర గీతాల రీమిక్స్‌లో కనిపించారో చూద్దాం..
ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. బాలకృష్ణ హీరోగా 1992లో వచ్చిన 'ధర్మక్షేత్రం' సినిమాలోని 'ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మ' పాట ఆనాటి నుంచి నేటి వరకు శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. మరి, అలాంటప్పుడు అదే పాటను కొత్త సినిమాలో పెట్టడం ఎందుకంటారా? వాస్తవానికి విశేష ఆదరణ పొందిన పాటలను రీమిక్స్ చేయడం సాహసం. అందుకే చాలామంది ఫిల్మ్‌మేకర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, యాక్టర్స్ వాటిని టచ్ చేయరు. కానీ, కొన్ని సందర్భాల్లో రీమిక్స్ తప్పనిసరి అనుకుని ముందుకెళ్తుంటారు. కొత్త చిత్రం 'అమిగోస్' లో తన బాబాయ్ పాటను ఎందుకు రీమిక్స్ చేయాల్సి వచ్చిందో కల్యాణ్‌రామ్ చెబుతూ.. ''ఈ సినిమా ద్వితీయార్థంలో కథ చాలా ఆసక్తిగా సాగుతున్నప్పుడు ఏదైనా కొత్త పాట వస్తే ప్రేక్షకులు నిరాశపడతారు. అలా జరగకుండా ఉండాలంటే ఏదైనా కొత్తగా చెయ్యాలని అనుకున్నాం. అందుకే ఆ రీమిక్స్ పెట్టాం. దాన్ని తెరపై చూసినప్పుడు అందరూ సర్‌ప్రైజ్ అవుతారు'' అని తెలిపారు. బాలకృష్ణ- దివ్యభారతిలపై చిత్రీకరించిన ఆ పాత పాటకు ఇళయరాజా స్వరాలు సమకూర్చగా.. కల్యాణ్‌రామ్ ఆషికా రంగనాథ్‌లపై చిత్రీకరించిన కొత్త పాటలో జిబ్రాన్ కొన్ని మార్పులు చేశారు.
అరే ఓ సాంబా.. 'ఎన్నో రాత్రులొస్తాయి..' కంటే ముందు 'అరే ఓ సాంబా' అనే పాటను రీమిక్స్ చేయించి తన 'పటాస్' సినిమాలోకి తీసుకున్నారు కల్యాణ్‌రామ్. బాలకృష్ణ, విజయశాంతి జంటగా 1992లో తెరకెక్కిన 'రౌడీ ఇన్‌స్పెక్టర్' చిత్రంలోని గీతమిది. బప్పీ లహిరి సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాట అప్పటి శ్రోతల్ని ఉర్రూతలూగించింది. ఆ స్థాయిని అందుకునేలా రీమిక్స్ చేశారు సంగీత దర్శకుడు సాయి కార్తీక్. కొత్త పాటలో బాలకృష్ణ ఫొటోలను ప్రదర్శించడంతో నందమూరి అభిమానులంతా థియేటర్లలో (2015) ఓ రేంజ్‌లో హంగామా చేశారు. అందులోని కల్యాణ్‌రామ్ లుక్స్, కథానాయిక శ్రుతి సోధి అందం ప్రేక్షకులను అలరించాయి.
కంటిచూపు చెబుతోంది.. బాలకృష్ణ హిట్ పాటలను కల్యాణ్‌రామ్, ఇతర హీరోలు రీమిక్స్ చేయగా.. ఆయన తన తండ్రి ఎన్టీఆర్ గీతాల రీమిక్స్‌లో నటించారు. శంకర్- జైకిషన్ స్వరాలందించిన 'జీవితచక్రం' (1971)లోని 'కంటిచూపు చెబుతోంది' పాటకు అప్పట్లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఎన్టీఆర్, వాణిశ్రీల హావభావాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 'పైసా వసూల్' చిత్రం కోసం సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఆ పాటకు కొత్తదనాన్ని తీసుకొచ్చారు. బాలకృష్ణ, ముస్కాన్ సేతిలపై ఆ పాటను చిత్రీకరించారు.