తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అప్పుడు చాలా బాధేసింది.. హృతిక్​, అక్షయ్ ధైర్యమిచ్చారు!: నితిన్ - హీరో నితిన్​ అప్డేట్స్​

Nithin Macharla Niyojakavargam: హీరో నితిన్ నటించిన కొత్త సినిమా 'మాచర్ల నియోజకవర్గం'తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర విశేషాలు తెలిపారాయన. కెరీర్​లో తాను ఎదుర్కొన్న విమర్శలు, ఆ సమయంలో ఎవరినీ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లారు సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులు...

Nithin about Macharla Niyojakavargam movie
Nithin about Macharla Niyojakavargam movie

By

Published : Aug 10, 2022, 6:41 AM IST

Nithin Macharla Niyojakavargam: పడిలేచిన కెరటానికి నిలువెత్తు నిదర్శనం కథానాయకుడు నితిన్‌. తొలి అడుగుల్లోనే వరుస విజయాలు రుచి చూశారాయన. ఆ స్టార్‌డమ్‌ను ఆస్వాదించేలోపే వరుస పరాజయాలూ ఎదుర్కొన్నారు. ఏడేళ్లకు పైగా పరాజయాలు వెంటాడినా.. 'ఇష్క్‌'తో తిరిగి నిలబడ్డారాయన. అప్పటి నుంచి కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ.. తన జైత్ర యాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు. మధ్యలో 'చెక్‌', 'రంగ్‌ దే' చిత్రాలతో కాస్త తడబడినా.. 'మ్యాస్ట్రో'తో తిరిగి ట్రాక్‌ ఎక్కారు. ఇప్పుడాయన 'మాచర్ల నియోజకవర్గం'తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు నితిన్‌.

ఈ చిత్రంతో... ప్రేమకథల నుంచి మాస్‌ కథల వైపు మనసు మళ్లిందనుకోవచ్చా?
''దీని వెనుక ప్రత్యేకమైన ప్లాన్‌ ఏమీ లేదు. 20ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రేమకథలు చేసీ చేసీ కాస్త బోర్‌ ఫీలింగ్‌ వచ్చింది. ఈసారి కాస్త కొత్తగా చేయాలి. నెక్ట్స్‌ లెవల్‌కు వెళ్లాలి అన్న ఉద్దేశంతో ఈ కథ ఎంచుకున్నా. మాస్‌ ఎలిమెంట్స్‌తో పాటు అన్ని రకాల వాణిజ్య హంగులు ఉన్న కమర్షియల్‌ చిత్రమిది. చాలా శక్తిమంతమైన పాత్రలో నటించా. సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు కనుల పండగలా అనిపిస్తుంది''.

కమర్షియల్‌ చిత్రాల్లోనూ కొత్తదనం కోరుకుంటున్నారు ప్రేక్షకులు. అలాంటి అంశాలు ఏమున్నాయి?
''ఇది కమర్షియల్‌ చిత్రమైనా.. మేము ఎత్తుకున్న పాయింట్‌ చాలా వినూత్నంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఫిక్షనల్‌ కథతోనే రూపొందింది. ఈ చిత్ర దర్శకుడిది గుంటూరు ప్రాంతం. చిన్నప్పటి నుంచి మాచర్ల పేరు వినీ వినీ ఉన్నాడు. ఆ పేరులో మంచి ఫోర్స్‌ ఉంది. అందుకే ఆ పేరుతోనే 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్‌ పెట్టాడు''.

ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేంటి?
''కథలో ఉన్న కొత్తదనమే. దీంట్లో నేను ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తా. ఈ తరహా పాత్ర నేనింత వరకు చేయలేదు. నిజానికి ఈ కథను ఓ ఐపీఎస్‌ అధికారి బ్యాక్‌డ్రాప్‌లోనూ చెప్పొచ్చు. కానీ, పోలీస్‌ పాత్రలన్నవి చాలా కామన్‌. అందుకే ఈ కథను ఓ ఐఏఎస్‌ అధికారి కోణం నుంచి చెప్పాలనుకున్నాం. సినిమా ప్రథమార్ధమంతా వినోదాత్మకంగా సాగుతుంది. ఇంటర్వెల్‌ నుంచి కథ యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్తుంది. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్లకూ ఎంతో ప్రాధాన్యముంది. హీరో మాచర్లకు వెళ్లేదే ఓ అమ్మాయి సమస్య తీర్చడానికి. మరి ఆ సమస్య ఏంటి? దాన్ని హీరో ఎలా పరిష్కరించాడు? అన్నది తెరపై చూడాలి. ఇందులో కేథరిన్‌ ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. కృతి నాకు జోడీగా కనిపిస్తుంది''.

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉందనిపిస్తోంది?
''కొవిడ్‌ తర్వాత ప్రేక్షకుల మూడ్‌ స్వింగ్‌ ఏమిటో అర్థం కావడం లేదు (నవ్వుతూ). ఏ సినిమా చూస్తున్నారు? వస్తున్నారో? సరిగ్గా అర్థం కావట్లేదు. టీజర్‌, ట్రైలర్‌లో ఏదో నచ్చి వస్తున్నారు. సినిమా నచ్చితే అది నడుస్తుంది అంతే. నాకు తెలిసి కొవిడ్‌ తర్వాతే కమర్షియల్‌ సినిమాకి స్కోప్‌ పెరిగింది. సాఫ్ట్‌, కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. మాస్‌, హ్యూమర్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న చిత్రాలే ఎక్కువ ఆడుతున్నాయి''.

మీకు సొంత నిర్మాణ సంస్థ ఉంది. ప్రస్తుత షూటింగ్స్‌ బంద్‌ను ఏ కోణంలో చూస్తారు?
''ఒక నెలలో అన్ని సమస్యలకు పరిష్కారం దొరికి.. చిత్రీకరణలు మొదలవుతాయని ఆశిస్తున్నా. పారితోషికాల విషయంలో అందరూ ఏదంటే.. నాది అదే మాట. నిజానికి దీనిపై నాకంత అవగాహన లేదు. పిలిస్తే షూటింగ్‌కు వెళ్తాను. యాక్టింగ్‌ చేస్తాను, అంతే''.

మీ బ్యానర్‌లో 'విక్రమ్‌' చిత్రం విడుదల చేశారు. అది చూశాక ఏమనిపించింది?
'విక్రమ్‌' చూశాక వారం రోజులు నిద్ర పట్టలేదు. సినిమా అంటే ఇలా ఉండాలి కదా.. ఇలా తీయాలి కదా అనిపించింది. కథని బలంగా నమ్మి చేస్తే ఇలాంటి సినిమాలు వస్తాయి. ఇలాంటి చిత్రాలు చేయడానికి హీరోలు త్యాగాలు చేయాల్సి ఉంటుంది. నా పాత్ర ఇలాగ ఉంటేనే చేస్తా.. మూడు పాటలుండాలి అని లెక్కలేసుకొని చేస్తే కుదరదు''.

20ఏళ్ల సినీ ప్రయాణం ఎలా ఉంది? అపజయాల్లో ఉన్నప్పుడు మీకు స్ఫూర్తినిచ్చిందెవరు?

''ఈ సుదీర్ఘ ప్రయాణంలో హిట్స్‌ చూశా. కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా. ప్రస్తుతం మంచి స్థితిలో ఉండటం తృప్తిగా ఉంది. వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు ఇండియాలో ఎక్కువ ప్లాప్స్‌ ఇచ్చిన స్టార్స్‌ ఎవరు అని గూగుల్‌ చేసేవాడ్ని (నవ్వుతూ). అక్షయ్‌ కుమార్‌, హృతిక్‌ రోషన్‌ పేర్లు వచ్చేవి. వాళ్లని చూసి స్ఫూర్తి పొందేవాడిని. అయితే ఆ సమయంలో నెట్టింట కొందరు చేసిన విమర్శలు మనసుని తీవ్రంగా బాధించేవి. 'మహ్మద్‌ గజనీలా దండయాత్ర చేస్తున్నావు. వేస్ట్‌.. సినిమాలు వదిలేసేయ్‌' అన్న విమర్శలూ విన్నా. అయితే ఆ విమర్శల్నే పాజిటివ్‌గా తీసుకొని ప్రయాణం కొనసాగించాను''.

ఎడిటర్‌గా ఉన్న రాజశేఖర్‌ దర్శకత్వం చేయగలడనే నమ్మకం మీకెలా కలిగింది?
''దర్శకుడు రాజశేఖర్‌ నాకు 'లై' సినిమా సమయం నుంచి తెలుసు. ఆయన ఆ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశాడు. తన ఎడిటింగ్‌ స్టైల్‌.. సినిమా విషయంలో తను ఇచ్చే ఇన్‌పుట్స్‌ నచ్చి 'నువ్వు సినిమా చేస్తే బాగుంటుందేమో' అని చెప్పా. నేను ఆ మాట చెప్పే వరకు తనకు దర్శకత్వం వైపు ఆలోచన లేదు. ఆ తర్వాతే తను ఇటు వైపు దృష్టి పెట్టాడు. కొవిడ్‌ టైమ్‌లో ఈ కథ రాసుకొని.. నాకు వినిపించాడు. అది నాకు బాగా నచ్చడంతో వెంటనే చేద్దామని చెప్పా. శేఖర్‌ స్వతహాగా ఎడిటర్‌ కావడం వల్ల.. స్క్రిప్ట్‌లో ఏది ఉంటే బాగుంటుంది? ఏది అవసరం లేదు? అన్నది తనకి స్పష్టంగా తెలుసు. ఒకరకంగా స్క్రిప్ట్‌ దశలోనే కథ చక్కగా ఎడిట్‌ అయిపోయింది''.

''పాన్‌ ఇండియా సినిమా చేద్దామనుకొని చేస్తే కుదరదన్నది నా అభిప్రాయం. సరైన కథ కుదిరినప్పుడు అది జరుగుతుంది. అలాంటి కథలు వస్తే చేస్తాను. మంచి కథ దొరికితే వెబ్‌సిరీస్‌ చేయాలన్న ఆలోచనా ఉంది. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ప్రస్తుతం అది చిత్రీకరణ దశలో ఉంది''.

ఇదీచూడండి: నయన్​-విఘ్నేశ్​ వెడ్డింగ్​ ప్రోమో.. రష్మికతో చైతూ రొమాన్స్​!

ABOUT THE AUTHOR

...view details