తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరిచుకునే ప్రయత్నం చేశా' - నందమూరి కళ్యాణ్​ రామ్ ఇంట్రవ్యూ

NANDAMURI KALYAN RAM BIMBISARA: 'లక్ష్మీ కళ్యాణం', 'పటాస్', 'అతనొక్కడే' వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు నందమూరి కళ్యాణ్ రామ్​. ఆయన తాజాగా 'బింబిసార' సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ 'ఈనాడు సినిమా'తో పలు విషయాలు ముచ్చటించారు. అవేంటో తెలుసుకుందాం.

nandamuri kalyan ram
నందమూరి కళ్యాణ్ రామ్

By

Published : Aug 4, 2022, 8:47 AM IST

NANDAMURI KALYAN RAM BIMBISARA: నటుడిగానైనా.. నిర్మాతగానైనా కల్యాణ్‌ రామ్‌లో ఓ తెగువ కనిపిస్తుంది. ప్రత్యేకంగా హద్దులంటూ గీసుకోకుండా.. ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు. నటుడిగా కొత్త కథల్ని భుజానికెత్తుకుంటూ.. కొత్త దర్శకులకి అవకాశాలిస్తూ ముందుకు సాగుతుంటారు. నిర్మాణం పరంగా నాణ్యతలోనూ తనకి తానే సాటి అనిపించుకుంటారు. ఆయన కథానాయకుడిగా సొంత సంస్థలోనే 'బింబిసార' చేశారు. వశిష్ఠ్‌ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌ బుధవారం హైదరాబాద్‌లో 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా ముచ్చటించారు.

'బింబిసార' కథని ఎప్పుడు విన్నారు? తొలిసారి కథ విన్నాక మీకేం అనిపించింది?

Bimbisara director: ఇలాంటి సినిమా చేస్తానని అస్సలు ఊహించలేదు. ఒక కథ దానికి అవసరమైన నటుల్ని అది ఎన్నుకుంటుందని మా నాన్న ఓసారి నాతో చెప్పారు. అందుకే 'బింబిసార' కథ నా దగ్గరికొచ్చిందేమో. 'ఎన్టీఆర్‌: మహానాయకుడు' చిత్రీకరణలో ఉండగా, వశిష్ఠ్‌ ఈ స్క్రిప్ట్‌తో నా దగ్గరికి వచ్చాడు. ఈ స్క్రిప్ట్‌లో మేజిక్‌ ఉందని తను చెప్పాడు. టైమ్‌ ట్రావెల్, ఫాంటసీ అంశాలతో కూడిన ఈ కథ వింటున్నప్పుడు చాలా ఆసక్తికరంగా, ఉత్సాహంగా అనిపించింది. అప్పటికి నా పాత్రలో వ్యతిరేక ఛాయల గురించి చెప్పలేదు. ఆ క్రూరత్వ కోణం జోడించాక కథ, పాత్ర మరింత బలంగా మారింది.

ఈ పాత్ర కోసం మీరెలా సన్నద్ధమయ్యారు?

'బాహుబలి' తర్వాత రాజు అంటే ఎలా ఉండాలో మనకు కొన్ని ప్రమాణాలు సెట్‌ అయ్యాయి. అందుకు తగ్గట్టుగా నా లుక్‌ కోసం రెండు నెలలపాటు కసరత్తులు చేసి డిజైన్‌ చేశారు. ఈ పాత్ర కోసం చేసిన ప్రయాణాన్ని, ఆ మార్పుని బాగా ఆస్వాదించా. నటుడిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశా. తెరపై మరింత దూకుడుగా, గంభీరంగా కనిపించాల్సి వచ్చింది. అందుకోసం నటనలోనూ ఓ కొత్త ప్రయత్నం చేసిన అనుభూతి కలిగింది. కఠినమైన ఆహార నియమాల్ని పాటించలేదు కానీ, సమతులాహారం తీసుకుని దేహాన్ని సిద్ధం చేసుకున్నా.

ప్రస్తుతం పరిశ్రమ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

తెలుగు ప్రేక్షకులు థియేటర్లకి రావడానికి ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటారు. మన భారతీయ ప్రేక్షకులకు సినిమా తప్ప మరో వినోదం లేదు. ఈ రోజుల్లో ట్రైలర్‌లు చాలా కీలకంగా మారాయి. దాన్ని చూసే మౌత్‌ టాక్‌ మొదలవుతుంది. ఈమధ్య 'విక్రమ్‌', 'మేజర్‌' ఘన విజయం సాధించాయి. పూర్తిగా కంటెంట్‌ ప్రధానంగానే తెరకెక్కి మంచి ఆదరణ పొందాయి. ప్రేక్షకులకు మంచి సినిమా ఇస్తే చాలు.. వాళ్లు తప్పకుండా ప్రోత్సహిస్తారు. ఆ విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. ట్రైలర్‌ని చూసి 'బింబిసార' రిఫ్రెష్‌గా ఉంటుందని భావిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రోత్సాహకరంగా ఉన్నాయి.

మీ నటనని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు ఎన్టీఆర్‌. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?

కల్యాణ్‌రామ్‌ 2.0ని చూస్తారు ప్రేక్షకులు. ఈ విషయాన్ని తారక్‌ స్వయంగా చెప్పాడు కదా. ట్రైలర్‌లో చూసింది కొంచెమే. సినిమాలో చాలా కోణాలు ఉంటాయి. వాటిని పెద్ద తెరపై చూడటం మరింత థ్రిల్‌నిస్తుంది.

కొనసాగింపుకి కథ సిద్ధమైందా?

'బింబిసార 2' కోసం ఇప్పటికే కథ సిద్ధమైంది. మూడు, నాలుగు భాగాల గురించి ఇప్పుడే చెప్పను కానీ, దీన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలనే ఆలోచనైతే ఉంది. ఫాంటసీ కథ కాబట్టి భవిష్యత్తులో మరిన్ని కొత్త అంశాలతో కథ విస్తారమయ్యే అవకాశాలున్నాయి.

నిర్మాణం పరంగా ఇందులో మీ పాత్ర ఎంత?

అటు నటన, ఇటు నిర్మాణం.. రెండు బాధ్యతల్ని మోయడం ఒత్తిడిగా ఉంటుంది. అందుకే నా బృందమే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌కి సంబంధించి నిర్మాణ వ్యవహారాల్ని చూసుకుంటుంది. 'ఇజం', 'పటాస్‌' సినిమాల విషయంలోనూ నిర్మాణ పరంగా నేనేం జోక్యం చేసుకోలేదు. ఇలాంటి కథల్ని వాళ్లే చేయాలి, వీళ్లే చేయాలనేమీ లేదు. ఎవరైనా ఎలాంటి పాత్రలైనా చేయొచ్చు. ఈ రోజు అగ్ర తారలు ఒకప్పుడు చిన్న పాత్రలతోనే ప్రయాణం ఆరంభించినవాళ్లే కదా. కల్యాణ్‌రామ్‌ రాజు గెటప్‌కి సెట్‌ అవుతాడని ఎవరైనా ఊహించారా? కానీ 'బింబిసార'తో ఏం జరిగింది? మా కథకి, పాత్రకి తగ్గట్టు మేం సినిమా చేశాం. కథానాయకుడిగానే కాదు, నిర్మాణం పరంగానూ సంతోషంగా ఉన్నాం. దిల్‌రాజు తీసుకున్న సినిమా హక్కులు, డిజిటల్‌ హక్కుల రూపంలో మేం కోరుకున్నదే నెరవేరింది.

ఎన్టీఆర్‌ 30వ సినిమా నిర్మాతల్లో మీరూ ఒకరు కదా? అది ఎప్పుడు పట్టాలెక్కుతుంది?

'ఆర్‌ఆర్‌ఆర్‌' విజయం తర్వాత ఎన్టీఆర్‌ సినిమా అంటే చాలా అంచనాలు ఉంటాయి. అందుకు దీటుగా ఉండాలంటే తొందర పడకూడదు. నిర్మాతలుగా మా కోణంలోనూ, దర్శకుడి కోణంలోనూ, కథానాయకుడి కోణంలోనూ రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్ట్‌లకి సమయం పడుతుంది. ఆ సినిమా మాకొక పెద్ద నిధి.

ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తారా?మల్టీస్టారర్‌పై మీ ఆలోచన ఏమిటి?

'ఏముందండీ, కథలొస్తే చేయడానికి రెడీనే' అని రొటీన్‌గా నేను చెప్పలేను. ఇద్దరు తారలు కలుస్తున్నారంటే చాలు కథేమిటనే అంశంతో సంబంధమే లేకుండా ప్రేక్షకులు అంచనాలు పెంచుకుంటారు. అందుకు తగ్గట్టుగా ఉండాలి, లేదంటే సమస్యలొస్తాయి. ఇద్దరు స్టార్‌ కథానాయకుల్ని కలిపి 'ఆర్‌ఆర్‌ఆర్‌' తీయడానికి మనకి ఇంత సమయం పట్టింది. ఆ బాధ్యతని రాజమౌళిలాంటి దర్శకుడు పూనుకుంటేనే అయ్యింది. మల్టీస్టారర్‌ సినిమాలు కుదరడం మాట్లాడుకున్నంత సులభం కాదు. 'మనం' తరహా చిత్రాలు చేయాలన్నా సరే, చాలా అంశాలు కుదరాలి.

మీ సంస్థలో బాలకృష్ణతో సినిమా చేసే ఆలోచన ఉందా?

Kalyan ram Balakrishna movie: బాలయ్య బాబాయ్‌కి ఒకసారి కథ చెప్పించా. అది నచ్చలేదు. మాకు నచ్చిన కథ బాబాయ్‌కి నచ్చాలని లేదు కదా. భవిష్యత్తులో మరో మంచి కథ మా దృష్టికి వస్తే తప్పకుండా బాబాయ్‌ని సంప్రదిస్తా.

"రొమాంటిక్‌ సినిమాల్ని నేను చేయను. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతాను. ఆ కథల విషయంలో నాకు చాలా అనుభవాలు ఎదురయ్యాయి. వాటికి నేను సరిపోను. ఆరంభంలో ప్రేమకథల్లోనే నటించా. 'అతనొక్కడే' నుంచి కొత్త ప్రయాణం మొదలుపెట్టా. కథలే ముఖ్యం కానీ, కొత్త దర్శకులతో సినిమా చేయడంలో నాకెలాంటి అభ్యంతరాలు ఉండవు".

ఇవీ చదవండి:'ఇంట్లో పూజగది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా?'

ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో 'మా' భేటీ.. వాటి లెక్క తేలాకే షూటింగ్స్​ షురూ!

ABOUT THE AUTHOR

...view details