తమిళ హీరో కార్తిపై ప్రశంసలు కురిపించారు హీరో నాగార్జున. తనకు కార్తికి మంచి అనుబంధం ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్, పునీత్ రాజ్‌కుమార్, కార్తి.. ఈ ముగ్గురు తాను చూసిన అరుదైన నటులని అన్నారు. కార్తి హీరోగా దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తెరకెక్కించిన 'సర్దార్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. రాశీఖన్నా, రజిషా విజయన్ కథానాయికలు. ఈ నెల 21న సినిమాను విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం నాగార్జున ముఖ్య అతిథిగా వేడుక నిర్వహించింది.
''నాకూ కార్తికి మంచి అనుబంధం ఉంది. 'ఊపిరి' సినిమాలో మేం కలిసి నటించిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సమర్పణలో 'సర్దార్' విడుదలవటం ఆనందంగా ఉంది. కార్తి అన్నయ్య సూర్య సూపర్‌స్టార్. అలాంటి స్టార్ నటుడి తమ్ముడి ఇమేజ్ నుంచి బయటకు వచ్చి తమని తాము నిరూపించుకోవటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి వారు అరుదు. తెలుగులో చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, కన్నడలో శివరాజ్‌కుమార్ తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్, తమిళంలో కార్తి నేను చూసిన అరుదైన నటులు. పలు విభిన్న పాత్రలు పోషించి, సూర్యలా కార్తి కూడా సూపర్‌స్టార్ అయ్యాడు. పాటలూ పాడతాడు. తెలుగులో బాగా మాట్లాడతాడు. అందుకే కార్తిని తెలుగు వారు విశేషంగా అభిమానిస్తారు'' అని నాగార్జున అన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.