"ప్రతీ శుక్రవారం రెండు మూడు సినిమాలు విడుదల కావడం సహజంగా మారింది. ఇక పండగల సమయంలో మూడు సినిమాలొచ్చినా ఏం ఇబ్బంది ఉండదు. ఆ నమ్మకంతోనే సినిమాని దసరాకు విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు థియేటర్‌కు వస్తే తప్పకుండా నవ్వుకుని బయటికి వస్తారు. అలాగని కేవలం నవ్వించడం కోసమే తీసిన సినిమా కాదు. వీర్యదానం అనే అంశం చుట్టూ ఈ కథ సాగినా అది ఎవ్వరికీ ఇబ్బందికరం కాని రీతిలో ఆద్యంతం వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం.
కథతోపాటే గణేశ్ వచ్చారు. ఒక అమాయకుడి చుట్టూ సాగే ఈ కథకు తను బాగా నప్పాడు. వర్ష బొల్లమ్మ ఒక చిన్న టౌన్‌కు చెందిన అమ్మాయిగా కనిపిస్తుంది. 'మిడిల్‌క్లాస్ మెలోడీస్'లో ఆమె నటనని చూసి ఎంపిక చేశాం. లక్ష్మణ్ చాలా నమ్మకంగా అనుకున్నది తీశాడు. మేం చిన్న చిన్న సలహాలు ఇచ్చాం అంతే".
*"మేం తీసిన 'డీజే టిల్లు' తర్వాత అన్నీ భారీ సినిమాలే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మొన్న విడుదలైన 'బింబిసార', 'సీతారామం', 'కార్తికేయ2'.. ఇలా వేటికవే భిన్నమైన సినిమాలు. వినోదాత్మక చిత్రాలు పెద్దగా రాలేదు. ఆ లోటుని భర్తీ చేసేలా ఉంటుందీ చిత్రం. నా దృష్టిలో ఇది కూడా ఓ ప్రయోగమే. 'డీజే టిల్లు' మొదులకొని 'వరుడు కావలెను', 'స్వాతిముత్యం' ఇలా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. తదుపరి వరుసగా వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేస్తున్నాం. బాలకృష్ణ, రవితేజ, వైష్ణవ్‌తేజ్, నవీన్ పోలిశెట్టితో సినిమాలు చేస్తున్నాం. కళాశాల నేపథ్యంలో సాగే ఓ కథతో ఎన్టీఆర్ బావమరిది నితిన్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాం. 'డీజే టిల్లు2' చిత్రీకరణ మొదలైంది. ఇందులో నాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది".
*"మా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలో రూపొందుతున్న మహేష్‌బాబు చిత్రం అంచనాలకు దీటుగా ఉంటుంది. మహేష్‌బాబు ఇప్పటివరకు చేయని పాత్రని ఇందులో చేస్తున్నారు. మహేష్-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు థియేటర్లలో అంతగా ఆదరణ పొందలేదు. కానీ టీవీల్లో ఆ సినిమాల్ని చూసి ఈ కలయికపై ప్రత్యేకమైన అంచనాల్ని పెంచుకున్నారు. ఏ స్థాయిలో అంచనాలు పెంచుకుని వచ్చినా అంతకుమించి మెప్పించేలా ఉంటుంది చిత్రం. ఇందులో మాస్‌ని మెప్పించేలా ఓ ప్రత్యేక గీతం కోసం దర్శకుడిని అభ్యర్థించాం. ఆయన ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది".