Dulquer Salman Career: మమ్ముట్టి వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు దుల్కర్ సల్మాన్. క్రమంగా నిర్మాతగానూ మారి కొత్త నటుల్ని ప్రోత్సహిస్తున్న దుల్కర్ తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడిలా.
బాల్యం బస్సుల్లో...చిన్నప్పుడు మేం చెన్నైలో ఉండేవాళ్లం. నాన్న హీరో అయినా ఆ ప్రభావం మాపై పడకుండా విలాసాలకు దూరంగా అక్కనీ, నన్నూ పెంచింది అమ్మ. బస్సులోనే మమ్మల్ని స్కూలుకు పంపేది. సెలవు రోజుల్లోనూ సిటీ బస్సుల్లోనే చెన్నై అంతా తిరిగేవాడిని. స్నేహితులతో కలిసి కాఫీ షాపుల్లో కూర్చునేవాడిని. అలా పెరిగిన నేను డిగ్రీ పూర్తి చేశాక అమెరికా వెళ్లి ఎంబీఏ చదివా.
నటన నచ్చదు...ఎందుకో తెలియదు నాకు చిన్నప్పుడు నటనంటే ఇష్టముండేది కాదు. డైరెక్టర్ని అయి సినిమాలు తీయాలని కలలు కనేవాడిని. నాన్న మాత్రం నన్ను హీరోను చేయాలనుకున్నారు. అందుకే చదువు పూర్తి చేసి అమెరికా నుంచి వచ్చాక బోలెడు అవకాశాలు వచ్చినా ఏదీ ఒప్పుకోకుండా ఓ ఆర్నెల్ల పాటు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నా. ఆ తరవాతే సినిమాలు ఒప్పుకున్నా. నా రెండో సినిమా 'జనతా హోటల్'కి ఫిల్మ్‌ఫేర్ అవార్డు రావడంతో సినిమాలపైన ఆసక్తి పెరిగింది.
వాటినే కొత్తగా..నాకు పాత కార్లని కొత్తగా చేయించడం చాలా ఇష్టం. అలా చేయించిన బోలెడు కార్లుంటాయి నా గ్యారేజీలో. కాస్త సమయం దొరికితే చాలు కార్లకు సంబంధించిన పుస్తకాలు కొని చదువుతుంటా. యూట్యూబ్‌లోనూ గంటలు గంటలు కార్లను ఆధునికీకరించే వీడియోలనే చూస్తుంటా.
పెళ్లితో స్థిరత్వం...చాలామంది స్థిరపడ్డాకే పెళ్లి చేసుకుంటే మంచిదంటారు. నాన్న మాత్రం పెళ్లితోనే స్థిరత్వం వస్తుందని నమ్ముతారు. అందుకే పాతికేళ్లకే సినిమాల్లోకి కూడా రాకముందే తమకు నచ్చిన అమ్మాయితో నాకు పెళ్లి చేశారు. నాభార్య అమల్ సూఫియా ఆర్కిటెక్ట్. పెళ్లి తరవాత ఇంటికే పరిమితం అయింది. మా పాప మరియమ్‌కి ఐదేళ్లు.