Guntur karam story : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి షూటింగ్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. ఫలితంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటికే మహేశ్ పాత్రకు సంబంధించిన లుక్ కూడా రిలీజైంది. అయితే ఆ మధ్యలో ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో కూడా ఉంటుందని ప్రచారం సాగింది. తాజాగా ఆ ప్రచారం మరోసారి ఊపందుకుంది.
మరో కొత్త పోస్టర్.. ఎందుకంటే సోషల్‌మీడియాలో తాజాగా ఓ కొత్త పోస్టర్ కనిపించింది. ఇందులో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్న ఓ ఫ్లెక్సీ కనపడుతోంది. ఇందులో గుంటూరు కారం సినిమాలోని పోస్టర్ అని చెబుతున్నారు. ఈ ఫ్లెక్సీలో 'ప్రజాబంధు జనదళం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వైర వెంకట స్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు. జనదళం పార్టీ యువజన నాయకులు నిజమాబాద్ జిల్లా' అని అందులో రాసి ఉంది. అంటే ప్రకాశ్ రాజ్.. శ్రీ వైర వెంకట స్వామి అనే రాజకీయ నేతగా కనిపిస్తారని తెలుస్తోంది.
అయితే ఈ సినిమాకు 'గంటూరు కారం' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్ర కథ మొత్తం.. గుంటూరు చుట్టు పక్కల సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుత పోస్టర్లో నిజమాబాద్ జిల్లా అని రాయడాన్ని కూడా నెటిజన్లు గమనిస్తున్నారు. ఈ చిత్రంలో రెండు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్ కాస్త లైట్‌గా టచ్ చేస్తారని అనుకుంటున్నారు.
ఇకపోతే గతంలోనే ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో ఉండొచ్చని కథనాలు వచ్చాయి. ఆ సమయంలో మూవీ టైటిల్ గురించి పెద్ద చర్చే కొనసాగింది. 'అమరావతికి అటు ఇటు' అనే టైటిల్ అయితే తెగ ట్రెండ్ అయింది. ఇక ఇదే సమయంలో ఏపీ పాలిటిక్స్‌లో రాజధాని విషయమై అమరావతి పేరు.. ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అందుకే ఈ పేరు వల్ల ఎటువంటి వివాదాలు తలెత్తకూడదని .. దాన్ని పక్కనపెట్టి 'గుంటూరు కారం' టైటిల్‌ను ఫిక్స్ చేసింది మూవీటీమ్.