"మంచి కథా బలమున్న చిత్రం 'లైగర్'. ఇది శారీరకంగా, మానసికంగా నాకు సవాల్ విసిరింది" అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఇది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనన్య పాండే కథానాయిక. ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
ప్రాంతీయ చిత్రంగానే..: 'లైగర్'ను తొలుత తెలుగులోనే తెరకెక్కించాలనుకున్నాం. అయితే అప్పటికే మన తెలుగు సినిమాలు కొన్ని పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాయి. మన కంటెంట్ అన్ని భాషల వారినీ ఆకట్టుకుంటుంది కదా.. ఆ రేంజ్‌లో మనమెందుకు చేయకూడదనిపించింది. అలా ప్రాంతీయ సినిమా కాస్తా పాన్ ఇండియా చిత్రంగా మారింది. కథ పరంగా ఇది పక్కా తెలుగు సినిమానే. టాకీ పార్ట్‌ను తెలుగు, హిందీ వెర్షన్లలో షూట్ చేశాం. ఈ ప్రాజెక్టుకి పని చేసిన సంగీత దర్శకులంతా బాలీవుడ్ వారు. అందుకే పాటలన్నీ హిందీలో ఉన్నట్లు అనిపిస్తుంది.
కరణ్‌తో అలా..:నా 'అర్జున్ రెడ్డి' నచ్చడం వల్ల కరణ్ జోహార్ ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడే నాతో సినిమా చేయాలని ఉందని చెప్పారు. తన దగ్గరకు వచ్చే కథల్ని నాకు పంపిస్తానన్నారు. ఓరోజు పూరితో చేస్తున్న ప్రాజెక్ట్ గురించి ఆయనకు చెప్పాను. దాన్ని పాన్ ఇండియా స్థాయిలో చేయాలనుందన్నా. కథ వినకుండానే ఈ చిత్రం నిర్మించేందుకు కరణ్ ఓకే అన్నారు. దీన్ని చాలామంది 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి'తో పోలుస్తున్నారు. కానీ, రెండింటికీ ఏం సంబంధం లేదు. తల్లీకొడుకుల ఎమోషన్ ప్రధానంగా సాగే చిత్రమిది. దీంట్లో నా పాత్రకు నత్తి ఉంది. దాన్ని చాలా ఎంజాయ్ చేస్తూ చేశా.
ఎంతో శ్రమించా..:ఈ చిత్రం కోసం నేను నా శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నా. దీని కోసం సుమారు 18 నెలలు కష్టపడ్డా. నిజానికి ఈ కథ విన్నప్పుడు నా లుక్ మార్చుకోవడానికి రెండు నెలల సమయం కేటాయిస్తే సరిపోతుందిలే అనుకున్నా. అందుకు తగ్గట్లుగానే రెండు నెలల టైమ్ అడిగి.. గట్టిగా కష్టపడ్డా. కానీ, బాడీలో ఏ మార్పు కనిపించలేదు. దీంతో లుక్ మార్చుకోవడానికి మరింత సమయం కావాలని కోరా. ఈలోపు బాడీ కనిపించకుండా ఉండే సీన్లు అన్నీ షూట్ చేసుకుందామని చెప్పా. ఇదే సమయంలో కొవిడ్‌తో గ్యాప్ రావడం వల్ల మరింత కష్టపడి లుక్ మార్చుకోగలిగా. అలాగే ఫైట్స్, డ్యాన్స్ నేర్చుకున్నా. ఈ చిత్రం కోసం నేను నా సర్వస్వం ఇచ్చేశా.