కేరళ నటుడు శ్రీనాథ్ భాసీపై తాత్కాలిక నిషేధం విధించింది కేరళ చిత్ర నిర్మాతల సంఘం(కేఎఫ్‌పీఏ). తన కొత్త సినిమా 'చత్తంబీ' ప్రమోషన్ సందర్భంగా యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో లేడీ యాంకర్‌తో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీనాథ్ తనను అసభ్య పదజాలంతో దూశించారని.. తన టీమ్ సభ్యులను కూడా బూతులు తిట్టాడని యాంకర్ ఆరోపించింది. అనంతరం బాధితురాలు మారడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనాథ్‌ను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై శ్రీనాథ్ సోమవారం బయటకు వచ్చారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేఎఫ్‌పీఏ కూడా అతడిపై తాత్కాలిక నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
అయితే శ్రీనాథ్ మంగళవారం తమ ముందుకు వచ్చాడని.. తన తప్పును ఒప్పుకున్నాడని కేఎఫ్‌పీఏ అధ్యక్షుడు ఎమ్ రంజిత్ తెలిపారు. దీంతో నిషేధాన్ని తాత్కాలికంగా విధించామని పేర్కొన్నారు. ఓ సినిమాకు ఒప్పందం కంటే అధిక పారితోషికం వసూలు చేశాడని కేఎఫ్పీఏలో అతడిపై మరో ఫిర్యాదు నమోదైంది. దీనిపై స్పందించిన ఎమ్ రంజిత్.. అధికంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి అతడు ఒప్పుకున్నాడని చెప్పారు. షూటింగ్ జరుగుతున్న సినిమాలు పూర్తి చేసుకునేందుకు అతడికి అనుమతిస్తున్నామని తెలిపారు.