Kangana Ranaut Comments On Fake News : తన సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఎప్పుడు ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలిచే కంగనా.. తన సినిమాల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై మండిపడ్డారు. దీని వెనుక మాఫియా ముఠానే ఉందంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా స్టోరీలో రాసుకొచ్చారు.
కంగనా తన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వైఫల్యాలని చెప్పిన వార్తల ఫొటోలను కూడా షేర్ చేశారు. 'బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు వసూళ్లూ సాధించిన చిత్రాలను ఫ్లాప్స్ అని ప్రచారం చేస్తున్నారు. నా చిత్రాలన్నీ ఫ్లాప్‌లు అని ప్రతి రోజూ 10 నుంచి 15 కథనాలు వెలువడుతున్నాయి. ఇతురుల పట్ల ఇంత దారుణంగా ఆలోచనలు ఎలా వస్తాయి. ఇతరులను చెడుగా చూపించటానికి రాత్రి పగలు అని తేడా లేకుండా ప్లాన్ చేస్తారా? దానికోసం సొంత ధనన్ని ఖర్చు చేస్తారా' అని కంగనా తీవ్ర ఆరోపణలు చేశారు.
2015లో కంగనా.. సన్నీడియోల్ కలిసి నటింటిన చిత్రం 'ఐ లవ్ న్యూ ఇయర్' బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు. ఈ చిత్రం తర్వాత ఆమె కెరీర్ అయిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే, కంగనా మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. సన్నీ డియోల్ నటించిన 'గదర్-2' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని తెలిపారు. అలానే సన్నీ డియోల్‌పై తనకు ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. 'నాతో పని చేసే వారు నన్ను కలిసే ప్రతి ఒక్కరూ ఒకే మాట చెబుతారు. 'మేము నటులు, దర్శకులు ఇలా చాలా మందితో పని చేశాము. కానీ, మీరు చాలా ప్రతిభావంతులు, ప్రొఫెషనల్. కానీ, మీడియాలో మీ గురించి ఎందుకు అలా రాస్తారు. అలాంటి అభిప్రాయం ఎందుకు ఉంది' అని అడుగుతారు' అని కంగనా చెప్పుకొచ్చారు.