Hero NTR Bimbisara Movie: నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం 'బింబిసార'. కేథరిన్, సంయుక్త మేనన్ కథానాయికలు. నూతన దర్శకుడు వశిష్ఠ్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్, వశిష్ఠ్, సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు, నటుడు శ్రీనివాస్ రెడ్డి సినీ విశేషాలు పంచుకున్నారు.
థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది..
''అందరిలానే నేనూ చందమామ కథలు వింటూ, చదువుతూ పెరిగా. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమాలు చూసి ఆనందించేవాడిని. సోషియో ఫాంటసీ చిత్రాల్లో నటించే అవకాశం నాకూ వస్తే బాగుంటుందనుకునేవాడిని. అలా నా కలను నిజం చేసిన దర్శకుడు వశిష్ఠ్‌కు కృతజ్ఞతలు. ఈ సినిమా నిర్మాణ విషయంలో నిర్మాత హరి ఎక్కడా తగ్గలేదు. విజువల్స్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమాను ఓ స్థాయిలో రూపొందించారు. ఎం. ఎం. కీరవాణి (సంగీతం), చోటా కె. నాయుడు (ఛాయాగ్రహణం).. ఇలా అద్భుతమైన టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేశారు. ప్రకాశ్‌రాజ్, సంయుక్త మేనన్, కేథరిన్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు తమ తమ పాత్రలతో మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ఇది థియేటర్లలో చూసి అనుభూతి పొందాల్సిన సినిమా'' అని కల్యాణ్ రామ్ తెలిపారు. అనంతరం, మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
'బింబిసార 2'లో మీ సోదరుడు తారక్ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు?
కల్యాణ్ రామ్: 'బింబిసార 2'లో తారక్ నటిస్తాడన్నది అవాస్తవం. దాని గురించి నేనెక్కడా ప్రస్తావించలేదు. ఇది ఊహాగానం మాత్రమే. ఈ కథను రెండు భాగాల్లో చెప్పాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. దానికి తగ్గట్టు స్క్రిప్టు సిద్ధం చేశాం. ప్రస్తుతానికి బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని పార్ట్ 1ని రూపొందించాం. ఇది ప్రేక్షకులకు నచ్చితే.. పార్ట్ 2 ఎప్పుడొస్తుందనే ఆసక్తి మొదలవుతుంది. అప్పుడే మేం 'బింబిసార 2'ను మరింత అద్భుతంగా తెరకెక్కించగలం. అంతేకాదు ఈ చిత్రానికి ఒకటి కాదు మరిన్ని సీక్వెల్స్ చేయాలనుకుంటున్నాం.
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే కథ అంటున్నారు. ఈ చిత్రం 'ఆదిత్య 369'లా ఉంటుందా?
కల్యాణ్ రామ్: ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే మీ ముందుకొస్తుంది. అప్పుడు దానికి సమాధానం మీరే చెప్తారు. టీజర్ విడుదలైన సమయంలో ఈ సినిమాను కొందరు 'మగధీర'తో, మరికొందరు 'బాహుబలి'తో పోల్చారు. ఇలాంటి గొప్ప సినిమాలతో మా చిత్రాన్ని పోల్చడం సంతోషం.