Anchor Suma Career: సుమ.. తెలుగునాట ప్రతి ఇంట్లో ఆమె సభ్యురాలే. స్వచ్ఛమైన తెలుగుతో, సరదా సంభాషణలతో అందరూ 'మన' అనుకునేలా చేసింది. తెరమీద తనేంటో మనకు తెలుసు. తెర వెనుక.. ముఖ్యంగా అమ్మగా 'సుమ' ఏంటి? అన్న ప్రశ్నకు సుమ సమాధానం చెప్పింది. ఆ సంగతులేంటో చదివేయండి.
నా 30 ఏళ్ల ప్రయాణాన్ని చూసుకుంటే ఆశ్చర్యమేస్తుంది. పదో తరగతి పూర్తవగానే టీవీ రంగంలోకి వచ్చా. అయితే అప్పటికే ఇందుకు కావాల్సిన శిక్షణంతా ఇంట్లోనే పూర్తయిందేమో అనిపిస్తుంది. అమ్మ విమల, నాన్న కుట్టి అందించిన క్రమశిక్షణ జీవితంలో అన్నింటినీ సమన్వయం చేయగలిగే శక్తినిచ్చింది.
రెంటినీ ఎలా? ఓవైపు ఇంటిని చూసుకుంటూనే మనం బయటి పనులూ చేస్తాం. ఎక్కడ ఉన్నా ఇంటిపైనే ధ్యాస. ఒకరకంగా ఇల్లు మన కనుసన్నల్లోనే నడుస్తుంది. కాబట్టి.. మనం.. వర్కింగ్ విమెన్ కాదు.. హౌస్ వైఫ్ ఫర్ వర్కింగ్ అంటే సరిగా సరిపోతుందేమో! ఏరోజుకారోజు హడావుడి పడిపోను. రేపేం చేయాలో ఈరోజే ప్రణాళిక వేసుకుంటా. వంట చేసి, పిల్లలను సిద్ధం చేసి, స్కూల్‌కు పంపి.. ఆపై షూటింగ్‌కు వెళ్లిన సందర్భాలెన్నో. ఒత్తిడి అనిపిస్తుంది. అలాగని ఆందోళనపడితే మన శక్తి హరించుకుపోతుంది కదా! అందుకే వీలైనంత దూరంగా ఉంటా.
స్వయంగానే..! మా బాబు రోషన్ పుట్టాక నా ప్రపంచమే మారిపోయింది. వాడీ లోకంలోకి వచ్చినపుడే.. నా ధ్యాసంతా వాడిపైనే పెట్టాలని నిర్ణయించుకున్నా. తర్వాత అయిదున్నరేళ్లకు స్నేహ మనస్విని పుట్టింది. ఇద్దరినీ చూసుకుంటూనే కెరియర్ కొనసాగించా. చాలామందికి పెళ్లయ్యాక, పిల్లలు పుట్టాక కెరియర్‌లో విరామం తీసుకోవాల్సిన పరిస్థితి. అదే కుటుంబం కొంచెం చేయూతనిస్తే కెరియర్‌ను కొనసాగించగలుగుతారు. లేదంటే ఎంతో కష్టపడి చదివినదంతా వృథానే కదా!
భయం.. బాధపడ్డ క్షణాలు.. బాబు పసివాడిగా ఉన్నప్పుడు షూటింగ్ మధ్యలో గంటా, రెండు గంటలు విరామం తీసుకొని వెళ్లి పాలు ఇచ్చి వచ్చేదాన్ని. ప్రయాణం మధ్యలో అనుకోకుండా కారు బ్రేకులు పడకపోయినా.. ఏదైనా ప్రమాదం జరిగినా ఏంటి పరిస్థితి? నా బాబు ఏమైపోతాడో అన్న ఆలోచనలు భయపెట్టేవి. ఒక్కోసారి వెళ్లడానికి వీలుండేది కాదు. అలాంటప్పుడు తననే షూటింగ్‌కి తీసుకొచ్చేసే దాన్ని. కాస్త పెరిగి, పెద్దయ్యాక స్కూలు నుంచి రాగానే 'అమ్మా.. ఎప్పుడొస్తావ్?' అంటూ పేచీ పెట్టేవాడు. ఒక్కోసారి లొకేషన్‌కీ వచ్చేసే వాడు. ఇక మా అమ్మాయి.. అప్పుడు తనకి అయిదారేళ్లు ఉంటాయేమో! ఓసారి 'నిన్ను చూడాలనిపిస్తే టీవీలోనే చూడాలా' అని అడిగింది. ఆ మాటలు నా గుండెను పిండేశాయి. అప్పుడు ప్రీ రిలీజ్‌లు, ఆడియో ఫంక్షన్లంటూ చాలా పని ఉండేది మరి! ఇంకోసారి 'వాళ్లు నిన్నే ఎందుకు పిలుస్తారు' అంది. ఇల్లు గడవాలి, మన ఖర్చులు ఇలా ఉంటాయి.. వీటన్నింటికీ డబ్బులు కావాలని సర్దిచెప్పా. అప్పుడు తను 'నాకే బొమ్మలూ వద్దు... నువ్వే కావాలి' అంది. దాంతో.. తను నన్నెంత మిస్ అవుతోందో అర్థమైంది. తర్వాత నుంచి పని తగ్గించుకున్నా. పిల్లలకు అనువుగా ఉండేలా నా పని తీరు మార్చుకున్నా. అవసరమైతే వాళ్లనీ షూటింగ్‌కి తీసుకెళ్లేదాన్ని. ఫిల్మ్‌సిటీలో షూటింగ్ అయితే అక్కడే పిల్లలను తయారుచేసి స్కూల్‌కు పంపిన రోజులెన్నో!
అమ్మగా కష్టమే.. ఒకరోజు షూటింగ్‌తో తీరిక లేకుండా ఉన్నా. అమ్మాయి నుంచి ఫోన్! తను కడుపునొప్పితో ఏడుస్తోంటే మనసు విలవిల్లాడింది. ఆ క్షణం తనకంటే పదిరెట్లు ఎక్కువ నొప్పి నేననుభవించా. ఎక్కడి పని అక్కడే వదిలేసి పరుగుతీశా. తనని ఆసుపత్రిలో చేర్చే వరకూ మనసు కుదుటపడలేదు. మరోసారి మా అబ్బాయి చెయ్యి విరగ్గొట్టుకున్నాడు. మళ్లీ అంతే. షూటింగ్ ఆపి పరుగుపెట్టా. ఇలాంటి సందర్భాల్లో అమ్మగా మన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు మరి.
నో చెబుతారా?.. కొన్ని సందర్భాల్లో తప్పదు. నో చెప్పాలి. అయితే అది కఠినంగా ఉండ కూడదు. మృదువుగానే చెప్పాలి. ముందు నిరుత్సాహపడ్డా, తర్వాత అర్థం చేసుకుంటారు. మా పాప బైక్ అడిగింది. బాబు కారు కావాలన్నాడు. కానీ లైసెన్స్ ఇచ్చే వయసు వచ్చే వరకూ అవి ఇవ్వడం కుదరదు, చట్టాన్ని అతిక్రమించకూడదు అని కచ్చితంగా చెప్పేశా.
పేరెంట్ మీటింగ్స్‌కు...పిల్లల భవిష్యత్‌కు సంబంధించిన విషయం కదా! తప్పక వెళతా. ఒక్కోసారి మీటింగ్‌ల గురించి అప్పటికప్పుడు తెలిసేది. నాకేమో ప్రోగ్రామ్‌లుండేవి. అయినా వాళ్లను ఒప్పించి మరీ హాజరయ్యే దాన్ని. టీచర్లు చెప్పేవన్నీ నోట్ చేసుకునేదాన్ని. పెద్ద పెద్ద కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటా. నా పిల్లల స్కూళ్లలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లకపోతే వాళ్ల మనసు చివుక్కుమంటుంది. అందుకే వీలైనంత వరకూ అన్నింటికీ వెళ్లే దాన్ని.
పాటించే చిట్కా..మాట ఇస్తే తప్పక నిలబెట్టుకుంటా. సమయపాలన, క్రమశిక్షణలకు విలువనిస్తా. మంచి ఆహారపుటలవాట్లు, వ్యాయామం, యోగా, ధ్యానం వంటివన్నీ అనుసరిస్తా. అప్పుడే కదా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి అన్నింటినీ సమన్వయం చేసుకోగలం! ఏ విషయమైనా బాగా చికాకు పరుస్తోంటే దాన్ని కాగితంపై రాసి చించేస్తుంటా. ఈ థెరపీతో మనసంతా తేలికవుతుంది. మీరూ ప్రయత్నించి చూడండి.