"తన జీవితంలోకి వచ్చే తోడు గురించి ప్రతి అమ్మాయీ కొన్ని కలలు కంటూ ఉంటుంది. అలా తనకి కాబోయేవాడి గురించి రకరకాల కలలు కంటూ... తన అభిరుచికి తగ్గట్టుగా లేడంటూ ప్రతి అబ్బాయినీ తిరస్కరించే ఓ అమ్మాయిగా కనిపిస్తా. నా పాత్ర చాలా సరదాగా సాగుతుంది. యాషికా అనే ఓ రేడియో జాకీగా కనిపిస్తా. సినిమా మొత్తం ఉండాలనే కోణంలో కాకుండా.. ఒకే రకంగా ఉండే ముగ్గురు వ్యక్తుల కథ కావడం, అందులోనూ కథానాయికగా నా పాత్రకి తగిన ప్రాధాన్యం దక్కడం నచ్చే 'అమిగోస్' చేయడానికి ఒప్పుకున్నా. కథానాయకుడి స్థాయిలో తెరపై కనిపించనేమో కానీ.. నేనెప్పుడు వచ్చినా ఆ ప్రభావం సినిమాపై కనిపిస్తుంటుంది".
"తెలుగు సినిమాలు నాకు కొత్త కాదు. చిన్నప్పుట్నుంచి తెలుగు సినిమాలు చూసేదాన్ని, పాటలు వినేదాన్ని. దాంతో నాకు తెలుగు సులభంగానే అర్థమవుతుంది. ఓ వేడుకలో పాల్గొనేందుకని హైదరాబాద్‌కి వచ్చా. అప్పుడే నన్ను ఈ చిత్రబృందం సంప్రదించింది. నేను కథ వినేందుకు సిద్ధమయ్యేలోపే ఈ సినిమా కోసం మరో కథానాయికని తీసుకున్నామని చెప్పారు. తీరా నేను బెంగుళూరు వెళ్లాక మళ్లీ ఫోన్ వచ్చింది. అలా దర్శకుడు రాజేంద్రరెడ్డి ఫోన్‌లోనే నాకు కథ వినిపించారు. కథ, పాత్రలు నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నా. కాస్త ఆలస్యమైనా ఓ మంచి కథతో, మంచి నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టాననే తృప్తి ఉంది".